దసరా పండుగ సందర్బంగా ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ ఉన్నవాటిలో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈనెల ఆరో తేదీ నుంచే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరగనుంది. దసరా సందర్భంగా 4,035 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
భారీగా పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్
ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు భారీగా ధరలు పెంచుతున్నారు. ప్రైవేట్ సంస్థలు టికెట్ ధరను 100 నుంచి 125 శాతానికి పెంచాయి. పండుగ దగ్గర పడే కొద్ది టికెట్ ధరలు మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖలకు బాగా డిమాండ్ ఉంటుంది. దీన్ని అదనుగా విజయవాడ ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో టికెట్ రూ.1100కు విక్రయిస్తున్నారు. నాన్ ఏసీ రూ.1000, వోల్వో బస్సుల్లో రూ.2000 వరకు పలుకుతోంది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.500 నుంచి రూ.600 వరకు మాత్రమే. విశాఖపట్నం వెళ్లే బస్సుల్లో టికెట్ ధర రూ.1100 నుంచి రూ. 3000 వరకు వసూలు చేస్తున్నారు. రాజమండ్రి మార్గంలో రూ.900 నుంచి రూ.2000 వరకు టికెట్ ధరలు పెంచేశారు. ఆర్టీసీ సైతం రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సుల్లో 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు తెలిపింది.
తెలంగాణ ప్రత్యేక బస్సులు
ఈ దసరాకు 4,035 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. వాటిలో 3,085 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, 950 బస్సులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రద్దీని బట్టి నడుపుతామని వివరించారు. హైదరాబాద్‌లో ప్రధాన బస్ స్టేషన్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు బీహెచ్ఈఎల్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్ పేట్, టెలీఫోన్ భవన్, దిల్‌సుఖ్‌గర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, అరాంఘర్ క్రాస్ రోడ్‌ల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు వరప్రసాద్ తెలిపారు. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులపై ఒకటిన్నర శాతం ఛార్జీలు అధికంగా వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా నడిపించే ఈ ప్రత్యేక బస్సులతో టీఎస్ ఆర్టీసీకి రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.