TSPSC Clarity On Group -1 Exam Rumors: తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో హైదరాబాద్ జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ల తప్పిదాలు, తదనంతర పరిణామాలతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకున్న కమిషన్.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఆ నివేదిక వచ్చాక సదరు కేంద్రంలోని 47 మంది అభ్యర్థుల ఓఎంఆర్ మూల్యాంకనంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. మిగతా అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రిలిమినరీ పరీక్ష పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగిందని, వదంతులు నమ్మవద్దని కమిషన్ వర్గాలు గురువారం తెలిపాయి.
ఆందోళనకు కారణమైన పరిస్థితులు ఇవీ:రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ మారేడుపల్లి సెయింట్ ఫ్రాన్సిస్ డీసేల్స్ పాఠశాలలో మూడు పరీక్ష గదుల్లోని 47 మంది అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమంతో కూడిన ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లిష్, తెలుగేతర మాధ్యమం ప్రశ్నపత్రాలు ఇచ్చారు.
ఈ తప్పిదాన్ని వెంటనే గుర్తించి, వారికి సరైన ప్రశ్నపత్రాల్ని పంపిణీ చేశారు. అయితే మార్చి ఇచ్చిన ప్రశ్నపత్రాల్ని తీసుకుంటే తమ ఓఎంఆర్ పత్రాల్ని మూల్యాంకనం చేయరన్న అపోహతో ఆయా అభ్యర్థులు నిరాకరించి, చాలా సమయం నిరసన వ్యక్తం చేశారు. వారితో జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరకు అభ్యర్థులు 12.45 గంటలకు పరీక్ష రాసేందుకు అంగీకరించడంతో వారికి మధ్యాహ్నం 1 నుంచి 3.30 వరకు పరీక్ష నిర్వహించారు.
వారంతా ఉదయం నుంచి 3.30 వరకు పరీక్ష కేంద్రంలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. ‘‘అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాలలోనూ ఇతర మాధ్యమం ప్రశ్నపత్రం రావడంతో అక్కడ ఇద్దరు అభ్యర్థులకు 15 నిమిషాలు, మరో అయిదుగురికి అరగంట అదనపు సమయం ఇచ్చాం. అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో 15 మంది అభ్యర్థులకు 7 నిమిషాలు ఎక్కువ ఇచ్చాం. హైదరాబాద్ జిల్లాలో ఏ పరీక్ష కేంద్రంలోనూ మాల్‌ప్రాక్టీస్ జరగలేదు.
అభ్యర్థులు సమయం కోల్పోయినందున టీఎస్‌పీఎస్సీని సంప్రదించి, నిబంధనల మేరకు అదనపు సమయం ఇచ్చాం. పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తప్పిదాలకు పాల్పడిన ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకుంటాం’’ అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం నాటి ఘటనలను అదేరోజు మీడియా ద్వారా వెల్లడిస్తే అపోహలు వచ్చేవి కాదని, ఎందుకు ఇవ్వలేదని కలెక్టర్‌ను కమిషన్ అడిగినట్లు తెలిసింది.
ఘటనపై ఆదివారం సాయంత్రం కమిషన్‌కు కలెక్టర్ ప్రాథమిక నివేదిక సమర్పించారు. ప్రిలిమినరీ పరీక్ష పారదర్శకంగా జరిగిందని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రంలో జరిగిన ఘటన, కారణాలను అందులో పేర్కొన్నారు.