TSPSC extended Group-4 Applications Date: తెలంగాణలో వెలువడిన ఉద్యోగాల దరఖాస్తులకు భారీ స్పందన వస్తోంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నేటితో గడువు ముగియడంతో ఇప్పటివరకు మొత్తంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను అధికారులు వెల్లడించారు. 8,180 పోస్టులకు 8,47,277 మంది అప్లై చేసుకున్నట్టు తెలిపారు. నిన్న ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆఖరి రోజైన సోమవారం కొత్తగా మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు.
మరోవైపు, దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు భారీ స్పందన వస్తుండటంతో సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగి దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని 25 విభాగాల్లో 8,180 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యవసాయ అధికారి ఉద్యోగాల దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5గంటల వరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది. సర్వర్లు మొరాయించడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా గ్రూప్ 4, వ్యవసాయ అధికారి దరఖాస్తుల గడువును టీఎస్‌పీఎస్‌సీ పొడిగించింది.
అదనంగా చేరిన బీసీ గురుకుల సొసైటీ పోస్టులు: గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనలో మరో 141 పోస్టులను అదనంగా టీఎస్‌పీఎస్సీ చేర్చింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో గ్రూప్-4 సర్వీసుల పరిధిలోకి వచ్చే 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. దీంతో బీసీ గురుకుల సొసైటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనలో ఇపుడున్న 8039 పోస్టులకు అదనంగా 141 ఉద్యోగాలు చేర్చుతూ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన 19/2022కు అనుబంధాన్ని జారీ చేసింది.
ఈ పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-4లో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో బాలుర విద్యాలయాల్లో 86 పోస్టులు, బాలికల విద్యాలయాల్లో 55 పోస్టులు ఉన్నాయి. గురుకుల బాలికల విద్యాలయాల్లోని పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హతగా అనుబంధంలో పేర్కొంది. ఇప్పటికే గ్రూప్-4 కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు కూడా దరఖాస్తు చేసినట్లు పరిగణిస్తామని కమిషన్ వెల్లడించింది.
ఆ పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ : వివిధ ఉద్యోగ నియామక పరీక్షలకు తేదీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 25న వ్యవసాయ అధికారి, మే 7న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, మే 13న పాలిటెక్నిక్ లెక్చరర్, మే 17న ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో ఫిజికల్ డైరెక్టర్... అదే రోజున ఇంటర్ కమిషనరేట్‌లో లైబ్రేరియన్ల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. ములుగు అటవీ కళాశాలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల అభ్యర్థులకు ఇంటర్వ్యూల షెడ్యూలును టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఇవీ చదవండి: