రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు టీఎస్‌ఐఐసీ భూములను సేకరించి అందులో పరిశ్రమలను ఏర్పాటు చేస్తోందని ఆసంస్థ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. పరిశ్రమల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు గాను ఐదేళ్లలో రూ.2,209 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 9 జోన్ల పరిధిలోని పారిశ్రామికవాడలలో చేపట్టిన భూ అభివృద్ధి , లేఅవుట్, రోడ్లు, నీరు, విద్యుత్, వివిధ రకాల అభివృద్ధి పనులు ప్రస్తుతం వివిధ దశలలో కొనసాగుతున్నాయని బాలమల్లు వివరించారు.
రూ.458.85 కోట్లతో నాలేడ్జ్ సిటీ...
హైదరాబాద్ కేంద్రంగా ఐటీ రంగం మరింత ఖ్యాతిని గడించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు అన్నారు. స్టార్టఫ్ కంపెనీలకు కొత్త ఆలోచనలను అందించేందుకు వీలుగా రూ.458.85 కోట్లతో నాలేడ్జ్ సిటీ, రాయదర్గంలో చేపట్టిన టీ హబ్ ఫేజ్-2 బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. అలాగే టీ- వర్క్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
6.33 ఎకరాలలో ఇమేజ్ టవర్ నిర్మాణం...
గేమింగ్, యానిమేషన్, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రొత్సహించేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోందని గ్యాదరి బాలమల్లు చెప్పారు. రాయదుర్గంలో 6.33 ఎకరాలలో ఇమేజ్ టవర్ పేరుతో రూ.946 కోట్ల వ్యయంతో 17 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించనునట్లు ఆయన వెల్లడించారు. టెండర్ల ప్రక్రియ పూర్తైందన్నారు. త్వరలో ఇమేజ్ టవర్ పనులను ప్రారంభించేందుకు టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టులు పూర్తయితే ఐటీ, యానిమేషన్ రంగాలలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని తెలిపారు