దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డులు దక్కాయి. దిల్లీలో జరిగిన ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ నిర్వహిచిన 13వ ఇండియా ఎనర్జీ సదస్సులో భాగంగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ చేతులమీదుగా సంస్థ ఛైర్మన్, ఎండీ రఘుమా రెడ్డి అవార్డు అందుకున్నారు. 2019కు గానూ... టీఎస్ఎస్పీడీసీఎల్కు ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు, ఎఫీసియెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్ అవార్డు, టెక్నాలజీ అడాప్షన్ అవార్డు, పర్ఫార్మన్స్ ఇంప్రూమెంట్ అవార్డులు దక్కాయి.
వినూత్న పద్ధతుల ద్వారానే...
అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, కచ్చితమైన విద్యుత్ బిల్లులు అందించటం కోసం ఐఆర్/ఐఆర్డీఏ ఆధారిత మీటర్ల ఏర్పాటు వల్లే సంస్థకు ఈ ఘనత వచ్చిందని సీఎండీ రఘుమా రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు స్కేడా, డీఎంఎస్ఎస్ఏఎస్ఏ వంటి అధునాతన పద్ధతులను ప్రవేశ పెట్టడం, విద్యుత్ నష్టాల తగ్గింపుతోపాటు, వినియోగదారుల సమస్యలను తీర్చటంలో సంస్థ అవలంభిస్తున్న వినూత్న పద్ధతులకు ఈ అవార్డులు దక్కాయని వివరించారు.