తెలంగాణ

telangana

ETV Bharat / state

VAJRA service: ప్రయాణికులు లేరని వజ్ర బస్సులు అమ్మేస్తారట.. - తెలంగాణ ఆర్టీసీ తాజా వార్తలు

ప్రయాణానికి కొత్త నిర్వచనం పేరిట.. ఆర్టీసీ వజ్ర మినీ ఏసీ బస్సులను ( VAJRA service) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదేళ్లక్రితం ప్రారంభమైన ఈ బస్సులను సరిగా నడపలేక... కాలం తీరకుండానే గంపగుత్తన అమ్మేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. కోట్ల రూపాయలు పెట్టి కొన్న బస్సులను... అమ్మేయాలనే ఆర్టీసీ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

vajra services
vajra services

By

Published : Jul 4, 2021, 8:33 AM IST

దూర ప్రాంతానికి వెళ్లే ఆర్టీసీ బస్సెక్కాలంటే బస్టాండు లేదా... ఆర్టీసీ (RTC) పాయింట్‌ వద్దకు వెళ్లాలి. అలాంటిది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆర్టీసీ వజ్ర సర్వీసు పేరుతో ( VAJRA service) మినీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. నేరుగా కాలనీల దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వజ్ర మినీ ఏసీ బస్సులను 2016-17లో అందుబాటులోకి వచ్చాయి. ఆన్​లైన్​లోనే సొమ్ము చెల్లించే పరిజ్ఞానం తీసుకొచ్చింది. ప్రయాణికుల భద్రత కోసం బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి చరవాణికి సమాచారం వెళ్లేలా సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్ని వసతులు కల్పించినప్పటికీ వజ్ర సర్వీసులు ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు.

అమ్మకానికి వజ్ర సర్వీసులు..

డిపోలకే పరిమితం..

కొంతకాలం పాటు అదే పద్ధతిలో బస్సులు నడిపి... చివరకు ఆ విధానానికి స్వస్తి చెప్పారు. మిగతా బస్సుల మాదిరిగానే బస్టాండ్లకే వజ్ర బస్సులను పంపేలా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. గరుడప్లస్​ ఛార్జీలు వీటిలోను వసూలు చేసేవారు. చిన్న బస్సు కావడం, ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంటే వైబ్రేషన్​ రావడం, ఏసీ సరిగా పనిచేయకపోవడం తదితర కారణాలతో ఈ సర్వీసులపై విముఖత పెరిగింది. అయితే నష్టాల్లోనే కొంతకాలం నడిపినప్పటికీ గతేడాది ఆర్టీసీ సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌తో వజ్ర సర్వీసులు పూర్తిగా మూలన పడ్డాయి.

అమ్మేయాలని నిర్ణయం..

ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 100 వజ్ర బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం వాటిన్నింటినీ అమ్మేయాలని సంస్థ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు డిపోల అధీనంలో ఉన్న బస్సులను హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఉన్న తుక్కు యార్డుకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తొలిదశలో 65 బస్సులు, తర్వాత మిగిలిన 35 బస్సుల్ని విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లక్రితం ప్రారంభమైన వజ్ర బస్సులు.. కాలం తీరకుండానే ప్రయాణికులకు దూరం కాబోతున్నాయి. వీటిని అమ్మేయాలనే యాజమాన్యం నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఇక ఏసీ బస్సులకు కొరత ఎక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగించాలో అన్న విషయంలో అధికారులు సరైన కసరత్తులు చేయకుండానే వాటిని విక్రయించేందుకు నిర్ణయం తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వజ్ర బస్సులు పైకి చాలా అందంగా ఉంటాయి. కానీ ప్రయాణీకులు విముఖత చూపుతున్నారు. ఉదాహరణకు కరీంనగర్​కు వెళ్లి వచ్చేటప్పటికి రెండువైపులా 330 కిలోమీటర్ల వరకు వస్తుంది. కానీ ప్రయాణికులు మాత్రం వెళ్లేటప్పుడు ఐదుమంది.. వచ్చేటప్పుడు పదిమంది ఉంటున్నారు. డీజిల్​ ఖర్చులకే సరిపోవడం లేదు.. ఇక నిర్వహణ భారంగా మారింది. లాక్​డౌన్​ తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారింది. -ఖాజా, ఆర్టీసీ మెకానిక్​

రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్‌ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్‌ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందని కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి. రద్దీగా ఉండే శ్రీశైలం, యాదాద్రి వంటి పుణ్య క్షేత్రాలకు తిప్పినా మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి:RTC Losses: పీకల్లోతు కష్టాల్లోకి ఆర్టీసీ.. అదనపు ఖర్చే కోటి..!

ABOUT THE AUTHOR

...view details