హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళావేదికలో టీఎస్‌ఐపాస్ ఐదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి హాజరయ్యారు. పారిశ్రామిక రంగంలో ముందున్న, ప్రగతికి కృషిచేసిన జిల్లాలకు 3 విభాగాల్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పురస్కారాలు అందజేశారు.
టీఎస్‌ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ కోసం గతంలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారని... ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని ఆయన తెలిపారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కార్మికులకు జీవనాధారమని... మెగా పరిశ్రమలు 30 శాతం మందికి ఉపాధి కల్పిస్తుంటే... ఎంఎస్ఎంఈలు 70 శాతం వరకు ఉపాధిని కల్పిస్తున్నాయన్నారు.
భూములను దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటాం
హైదరాబాద్‌లో ఫార్మాసిటీని అతిత్వరలోనే ప్రారంభించబోతున్నామన్నారు. సులభతర వాణిజ్యంలో అగ్రభాగాన ఉండటంతో పాటు... ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే భూమిని సద్వినియోగం చేసుకోవాలని... గతంలో జరిగిన భూకేటాయింపులను మరోసారి సమీక్షిస్తామని తెలిపారు. పరిశ్రమలకు కేటాయించిన భూములను దుర్వినియోగం చేస్తే వెనక్కి తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. వైట్, పింక్, గ్రీన్, బ్లూ రెవల్యూషన్లలో తెలంగాణ అగ్రభాగాన నిలవాలని ఆయన ఆకాంక్షించారు.