గ్రామ రెవెన్యూ అధికారులను (వీఆర్వో) వారి ఐచ్ఛికాల మేరకు పలు శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంబంధిత దస్త్రానికి సీఎం ఆమోదం లభించినట్లు సమాచారం. రాష్ట్రంలో 2020 అక్టోబరులో వీఆర్వోల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ ఆధారంగా భూలావాదేవీలు, యాజమాన్య హక్కుల మార్పిడిని ఆటోమేటిక్ విధానంలో నిర్వహిస్తున్నందున.. విచారణలు, ఇతర ప్రక్రియలేవీ అవసరం లేని కారణంగా వీఆర్వో వ్యవస్థతో పెద్దగా పనిలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయనున్నట్లు తెలిపింది. అయితే, 18 నెలలుగా ఉత్తర్వులు విడుదల చేయలేదు.
రాష్ట్రంలో 5,485 మంది వీఆర్వోలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖల్లోనూ కొన్ని జిల్లాల్లో ఈ సిబ్బంది అవసరం ఉందని అంచనా వేసింది. ఆయా శాఖల్లో ఇప్పటికే ఉన్నవారి సీనియారిటీకి భంగం కలగకుండా సమన్వయం చేయనున్నట్లు తెలిసింది. వీఆర్వోల సర్వీస్, పదోన్నతులు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలు, భూముల నిర్వహణ పరంగా సిబ్బంది అవసరం ఉన్న పెద్ద మండలాల్లో కొందరిని రెవెన్యూ శాఖలోనే కొనసాగించే అవకాశాలూ ఉన్నాయి.