రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సమూల మార్పులు చేర్పులను తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. సరళతరం చేయడం, పారదర్శకత తీసుకురావడం, వేగవంతమైన సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ నెల 14 నుంచి మార్పులతో కూడి మొదలైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో లోటుపాట్లను క్రమంగా సరిదిద్దుతోంది. అందులో భాగంగానే ఇటీవల అన్ని వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి ఆయా వర్గాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఒకటి ఒకటి పరిష్కరించే పనిలో ప్రభుత్వం పడింది.
సాధారణంగా వ్యవసాయేతర భూములు కానీ, ఆస్తులుకాని అమ్మాలన్నా… కొనాలన్నా వాటి చరిత్రను తెలియపరిచే లింక్ డాక్యుమెంట్లు అవసరం. కొన్నిసార్లు లింక్ డాక్యుమెంట్లు ఎక్కువ ఉన్నట్లయితే వాటిని క్రోడీకరించి ఒక డాక్యుమెంటులో రాసుకుంటారు. దానిని తీసుకెళ్లి ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఉపయోగిస్తారు. దానిని రిజిస్ట్రేషన్ చేసేముందు సబ్ రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తారు. లింక్ డాక్యుమెంట్లల్లో ఉన్న వివరాలనే క్రోడీకరించి రాసిన డాక్యుమెంట్లో ఉన్నాయా లేవా అని చూస్తారు. అన్ని వివరాలతో డాక్యుమెంట్ ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ఇప్పుడు స్లాట్ బుకింగ్ విధానంలో ఈ లింక్ డాక్యుమెంట్ల ప్రస్తావన లేదు. ఇది ఆస్తుల క్రయవిక్రయాలకు, బ్యాంక్ రుణాల మంజూరుకు ప్రధాన ఆటంకంగా ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.