తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదు మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటిన తెరాస - siddipet municipality

మినీ పురపోరులో కారు జోరుకు ఎదురే లేకుండా పోయింది. జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌, సిద్దిపేట మున్సిపాల్టీల్లో తెరాస అత్యధిక వార్డులను ఖాతాలో వేసుకుని విజయం సాధించింది. అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టారు. కాంగ్రెస్‌, భాజపా స్వల్ప స్థానాలకే పరిమితమై పోటీలో నామమాత్రంగా నిలిచాయి.

ఐదు మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటిన తెరాస
టీఆర్​ఎస్​

By

Published : May 3, 2021, 7:53 PM IST

Updated : Jan 19, 2023, 3:48 PM IST

పురపాలికల్లో స్పష్టమైన మెజార్టీతో అధికార తెరాస పాగా వేసింది. విపక్షాలైన కాంగ్రెస్‌, భాజపాను మట్టికరిపించిన అధికార పార్టీ... అన్ని మున్సిపాల్టీల్లోనూ హవా కొనసాగించింది. ఉదయం నుంచే ఫలితాల సరళిలో కారు దూసుకెళ్లగా.. స్వల్ప స్థానాలతో ప్రతిపక్ష పార్టీలు కనీస పోటీని ఇవ్వలేకపోయాయి. ఆయా చోట్ల మంత్రులు ప్రచార బాధ్యతను స్వయంగా మోసి తెరాసకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. ప్రజావిశ్వాసం చూరగొన్న గులాబీ పార్టీకి పుర ఫలితాల్లో ఎదురేలేకుండాపోయింది.

సిద్దిపేట ఏక పక్షమే

సిద్దిపేట మున్సిపాలిటీలో తెరాస విజయదుందుభి మోగిచింది. మొత్తం 43 స్థానాల్లో తెరాస 36 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల విజయం సాధించారు. ఇక భాజపా, ఎంఐఎం ఒక్కో స్థానం దక్కించుకున్నాయి. ఏ ఒక్క వార్డులోనూ కాంగ్రెస్​ ఖాతా తెరవలేదు.

కొత్తూరులో పోటాపోటీ

జడ్చర్ల మున్సిపాలిటీ తెరాస వశమైంది. మొత్తం 27 వార్డులకు గాను 23 స్థానాలను తెరాస కైవసం చేసుకుని పురపాలిక పీఠాన్ని ఖాతాలో వేసుకుంది. జడ్చర్లలో చెరో రెండో వార్డుల్లోనే ఉనికి చాటుకుని కాంగ్రెస్‌, భాజపా చతికిల పడ్డాయి. జడ్చర్ల ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా గెలిచిన అభ్యర్థుల్లో 8వ వార్డు తెరాస అభ్యర్థి లక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అచ్చంపేటలోనూ తెరాస ఆధిక్యం నిలబెట్టుకుంది. మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో తెరాస అభ్యర్థులు గెలుపొందారు. ఆరు వార్డులను కాంగ్రెస్‌ నిలబెట్టుకుని ఫర్వాలేదనిపించగా భాజపా .. ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ జరనల్‌కు కేటాయించగా 16వ వార్డు నుంచి గెలిచిన నర్సింహ గౌడ్ రేసులో ఉన్నారు.

కొత్తూరు పురపాలిక ఛైర్మన్‌ స్థానాన్ని అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ ఏడింట విజయం సాధించింది. ఐదు వార్డులను కాంగ్రెస్‌ అభ్యర్థులు చేజిక్కించుకుని అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చారు. కొత్తూరులో కమలం పార్టీ బోణి కొట్టలేకపోయింది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గెలిచి ఊపుమీదున్న గులాబీ పార్టీ... నకిరేకల్‌ మున్సిపల్‌ పోరులోనూ సత్తా చాటింది. మొత్తం 20 వార్డులుండగా 11 మంది తెరాస అభ్యర్థులు గెలిచి పురపీఠాన్ని దక్కించుకున్నారు. ఆరు వార్డుల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌, రెండింట కాంగ్రెస్‌, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. నల్గొండ 26వ వార్డుకు జరిగిన ఉపఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది.

లింగోజిగూడలో అనూహ్యంగా కాంగ్రెస్​ విజయం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్, నిజామాబాద్ జిల్లా బోధన్ పురపాలికలోని ఒక్కో వార్డుకు జరిగిన ఉపఎన్నికలోనూ అధికార పార్టీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. జీహెచ్​ఎంసీ పరిధిలోని లింగోజిగూడ ఉపపోరులో అనూహ్యంగా కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ శేఖర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప భాజపా అభ్యర్థి అఖిల్ గౌడ్ పై 1272 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెరాస మద్దతిచ్చినా సిట్టింగ్ స్థానాన్ని భాజపా నిలుపుకోలేకపోవడం గమనార్హం. తాజా గెలుపుతో జీహెచ్​ఎంసీలో కాంగ్రెస్‌ కార్పొరేటర్ల బలం మూడుకు చేరింది. గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ధ్రువ పత్రాలు అందజేశారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు అనుమతించకపోవడం వల్ల సందడి అంతగా కనిపించలేదు.

ఇదీ చదవండి:జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెరాస

Last Updated : Jan 19, 2023, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details