గ్రేటర్‌లో ప్రస్తుతం తెరాసకు 17 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక్కడి 24 నియోజకవర్గాల పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. పాతబస్తీకి సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని డివిజన్లలోనూ తెరాస అభ్యర్థులే విజయం సాధించారు. గతసారి 99 డివిజన్లు రాగా ఈసారి 104 దక్కించుకోవాలన్నది తమ లక్ష్యమని మంత్రి తలసాని ఇటీవల ప్రకటించారు. వంద డివిజన్లకు మించి తెరాస గెలవాలంటే పాతబస్తీలోనూ పాగా వేయాల్సిందే. గత ఎన్నికల్లో ఇక్కడ 5 డివిజన్లలో విజయం సాధించారు కాబట్టి ఈసారి ఆ సంఖ్య మరింత పెరగాల్సిందేనని పార్టీ నేతలు అంటున్నారు. 99 సిట్టింగ్ కార్పొరేటర్లలో 26 మందికి తిరిగి టికెట్లు ఇవ్వలేదు. ఇద్దరు తెరాసను వీడి వెళ్లిపోయారు. ప్రస్తుతం చాలా చోట్ల హోరాహోరీగానే పోటీ ఉందని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ అయిదు రోజులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచించారు.
- చాలా తక్కువగా ఓటింగ్ నమోదయ్యే డివిజన్లు: 50
- వీటిలో ఒక్కోదానిలో గరిష్ఠ ఓటర్లు: 27 వేలు
- ఒక్కో డివిజన్‌లో గతసారి ఓటేసినవారు: 15 వేలు
కీలక నేతలతో మంతనాలు
- బస్తీల్లో ఓట్లు చెదిరిపోకుండా ఉండటానికి తమ అనుచర గణాన్ని శాసనసభ్యులు రంగంలోకి దింపారు. అర్థరాత్రి వరకు నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతలతో మంతనాలు జరుపుతూ పరిస్థితిని అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
- గత ఎన్నికల పోలింగ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో డివిజన్‌లో 15 వేలకు మించి ఓటింగ్ నమోదు కావడం లేదు.
- ఒక్కో డివిజన్‌లో ఇక్కడ ఆరేడు వేల ఓట్లర్లను ఆకట్టుకుంటే సులభంగా విజయం సాధించవచ్చన్న ఉద్దేశంలో ఎమ్మెల్యేలున్నారు. తొలి ప్రాధాన్యం కింద వీటిపై దృష్టిసారించారు.
- కొంతమంది ఎమ్యెల్యేలు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి మరీ సిట్టింగ్‌లను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లను ఇప్పించుకున్నారు. ఇటువంటి చోట్ల అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం తామే పోటీలో ఉన్నామా అన్నట్లుగా కష్టపడుతున్నారు. ఖర్చు కూడా భారీగానే అవుతోంది.