హైదరాబాద్ మహా నగరంలో ప్రతి రోజు నీటిసరఫరా.. పాతనగరానికి మెట్రో రైలు, రహదారులు, నాలాల అభివృద్ధి, మరిన్ని రెండు పడక గదుల ఇళ్లు.. పేదలకు అదనపు భారం లేకుండా ఆస్తి హక్కులు, సినీ పరిశ్రమ సహా వివిధ వర్గాలకు వరాలు.. జీహెచ్‌ఎంసీ తెరాస మేనిఫెస్టోలో ఉండనున్నాయి.మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ఇవాళ విడుదల చేయనున్నారు.
- జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రసుత్తం రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. త్వరలో కేశవాపురం రిజర్వాయర్ సిద్ధం కానుంది. అది అందుబాటులోకి రాగానే ప్రతీరోజూ నీటిసరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
- హైదరాబాద్‌లో రోడ్లు తరచూ దెబ్బతినడం, పలుచోట్ల విస్తరణ లేకపోవడం, కొత్త వాటిని డిమాండ్లు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకొని..ఇందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, స్టీలు వంతెనలు, అండర్‌పాస్‌లను ఎన్నికల ప్రణాళికలో ప్రకటించనుంది.
- వర్షాలు, వరదల సమయంలో నాలాల వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు. దీనిపై ప్రభుత్వం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి (ఎస్‌ఎన్‌డీపీ)ని ప్రకటించింది. నాలాల విస్తరణ, కొత్తవాటి నిర్మాణం, ప్రత్యామ్నాయం చూపి ఆక్రమణల తొలగింపు, మురుగు నీటిపారుదల వ్యవస్థను పటిష్ఠపరచడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
- చెరువుల ఆక్రమణలు ఇటీవల వరద బీభత్సానికి కారణమయ్యాయి. వీటి పునరుద్ధరణపైనా ప్రభుత్వం దృష్టి సారించనుంది. వరద నీటి కాల్వల విస్తరణ చేపట్టనుంది.
- పాతనగరానికి మెట్రో సేవలందించాలన్న డిమాండు పెరుగుతోంది. మజ్లిస్ పార్టీ సమన్వయంతో మెట్రోను సత్వరమే చేపట్టాలని తెరాస భావిస్తోంది. దీనిపై తాజా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించనున్నట్లు తెలిసింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆర్థిక జిల్లా.. మరికొన్ని ప్రాంతాలు ఇందులో ఉన్నట్లు సమాచారం.
- బహుళ విధ రవాణా వ్యవస్థ (ఎంఎంటీఎస్) రైళ్ల విస్తరణ సాగాలి. వీటి పనులకు సంబంధించి తెరాస ఎన్నికల ప్రణాళికలో ప్రభుత్వ విధానం వెల్లడికానుంది. నగరంపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే, బస్ టెర్మినళ్ల ఏర్పాటుపైనా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించనున్నారని తెలుస్తోంది.
- నగరంలో 350 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్యసేవలందిస్తున్నాయి. మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
- మరిన్ని బస్‌స్టాప్‌లు, సంచార టాయ్‌లెట్ల ఏర్పాటు వంటివి ప్రణాళికలో చేర్చనున్నట్లు సమాచారం.
- చర్లపల్లి పారిశ్రామిక ప్రాంత పరిధిలోని 9 కాలనీలలో భూవినియోగ మార్పిడి, క్రమబద్ధీకరణ సౌకర్యాన్ని కల్పించింది. ఇదే పంథాలో మిగిలినచోట్ల వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిసింది.
- సినీ పరిశ్రమపై వేలాది కుటుంబాలు దానిపై ఆధారపడి ఉన్నాయి. వాటికి సంబంధించిన సమస్యల పరిష్కారంతో పాటు రాయితీలు, మినహాయింపులు ఇస్తామని సీఎం వెల్లడించారు. దీనిపై త్వరలో కార్యాచరణను సిద్ధం చేయనున్నారు.