తెలంగాణ

telangana

ETV Bharat / state

'బంద్'​కు తెరాస మద్దతు.. ఆందోళనల్లో ప్రజాప్రతినిధులు

రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. నేటి భారత్ బంద్​లో పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు సన్నద్ధమైంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలందరూ ఇవాళ వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొననున్నారు. బంద్​ను విజయవంతం చేసేలా శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేశారు.

Trs leaders participating in Bharat Bandh
'బంద్'​కు తెరాస మద్దతు.. ఆందోళనల్లో ప్రజాప్రతినిధులు

By

Published : Dec 8, 2020, 3:45 AM IST

రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి భారత్​ బంద్​ను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలందరూ వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొననున్నారు. బెంగళూరు రహదారిపై షాద్ నగర్ సమీపంలోని బూర్గుల గేట్ వద్ద కేటీఆర్ రాస్తోరోకోలో పాల్గొననున్నారు. తూప్రాన్ వద్ద హరీశ్​ రావు, ఆలంపూర్​లో నిరంజన్ రెడ్డి, మహేశ్వరం వద్ద సబితా ఇంద్రారెడ్డి, హుజూరాబాద్​లో ఈటల రాజేందర్, హైదరాబాద్​లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ నిరసనల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నియోజకవర్గాల్లో రైతులకు సంఘీభావంగా బంద్​లో పాల్గొనాలని తెరాస నాయకత్వం పిలుపునిచ్చింది. తెరాస అనుబంధ సంఘాలు చురుగ్గా భాగస్వామ్యమయ్యేలా సిద్ధమయ్యాయి. ఉదయం కనీసం రెండు గంటల పాటు బంద్​లో పాల్గొనాలని వ్యాపార, వాణిజ్య సంస్థలను కేటీఆర్​ కోరారు.

పార్టీలకతీతంగా బంద్​లో పాల్గొనాలి..

భారత్​ బంద్​ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ కోరారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. భారత్​ బంద్​లో భాగంగా ఎక్కడికక్కడే కార్యకర్తలు, నాయకులు రహదారులు దిగ్బంధించాలన్నారు. కొత్త వ్యవసాయ చట్టం వల్ల మార్కెట్ కమిటీల పాత్ర నామమాత్రమై పోయిందని విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి ఆరోపించారు. ప్రజానీకానికి ధరలు అందుబాటులో లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా భారత్ బంద్​లో పాల్గొని కేంద్రానికి నిరసన తెలపాలని రైతులను కోరారు.

కేంద్రం మెడలు వంచైనా..

రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తూ.. తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్​ బంద్​ను విజయవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. బంద్​కు మద్దతుగా హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిరసన తెలుపుతారని వెల్లడించారు. కొత్త చట్టాల వల్ల నిత్యవసరాల పరిధిలోకి వచ్చే ఆహారపంటలను కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచైనా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయించాలని ఆయన తెలిపారు. దిల్లీలో పట్టుసడలకుండా కర్షకులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలపడం నైతిక బాధ్యత అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్​కుమార్​ తెలిపారు. సార్వత్రిక సమ్మెలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.

రహదారి దిగ్బంధన..

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెరాస నేతలు నిరసన కార్యక్రమాలకు రహదారి దిగ్బంధన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. బంద్​కు సన్నాహకంగా ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే ధాస్యం వినయ్ భాస్కర్ ఎడ్లబళ్లతో ప్రదర్శన నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్య కూడళ్ల వద్ద... తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు బంద్​కు మద్దతుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో జరిగే పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి :'భారత్​ బంద్​'కు ఆర్టీసీ సంఘాల మద్దతు

ABOUT THE AUTHOR

...view details