రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా(కారుదే జోరు.) అధికార పార్టీ ఆధిపత్యానికి అడ్డే లేకుండాపోతోంది. తాజాగా జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్ పర్సన్ల ఎన్నికల్లోనూ తెరాస మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు . తొమ్మిందిటిలోనూ పాగావేసి కారు వేగానికి తిరుగులేదనిపించారు.
TRS Grand victory in DCCB Chairman's
By
Published : Feb 29, 2020, 6:21 PM IST
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సహకార ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల ఛైర్మన్, ఉపాధ్యక్ష పదవులన్నీ గులాబీ మద్దతుదారులే దక్కించుకున్నారు.
జిల్లా పదవుల కోసం చివరి వరకు అనేక మంది నేతలు పోటీ పడ్డారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార పార్టీ నాయకత్వం అడుగులు వేసింది. వ్యక్తిగత నేపథ్యం, సేవాభావం, పార్టీకి ఉపయోగ పడ్డ తీరు ఆధారంగా తెరాస అధిష్ఠానం డీసీసీబీ, డీసీఎంఎస్‌ల ఛైర్మన్‌లు, ఉపాధ్యక్షులను ఎంపిక చేసింది. ఎన్నికకు గంట ముందు సీల్డ్ కవర్లలో ఛైర్మన్, ఉపాధ్యక్షుల పేర్లను పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్యేలకు పంపించడం వల్ల ఎన్నిక సజావుగా జరిగేందుకు మార్గం సుగమమైంది.
పూర్తి ఆధిక్యం వల్ల మొత్తం అన్ని పదవులు తెరాస ఖాతాలోనే పడ్డాయి. ఎన్నికలకు పరిశీలకులుగా వ్యవహరించిన నేతలు సమన్వయంతో వ్యవహరించారు. జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి గులాబీ పార్టీకే అన్ని పదవులు దక్కేలా వ్యూహాలు రచించి సంపూర్ణ విజయం సాధించారు.