హనుమకొండ హనుమాన్‌నగర్‌కు చెందిన కైలాస శ్రీనివాస్, ఆకుతోట కవికిరణ్ ఏటా శబరిమల వెళ్లి వస్తారు. ప్రతిసారీ వారిది రైలు ప్రయాణమే. ఈసారి రిజర్వేషన్ దొరక్కపోవడంతో ఈ నెల 15న విమానంలో కొచ్చికి.. అక్కడి నుంచి శబరిమలకు వెళ్లి వచ్చారు. రైల్లో రానుపోను థర్డ్ ఏసీలో రూ.మూడున్నర వేలు ఖర్చయ్యేది. ఈసారి విమాన ప్రయాణం కావడంతో వెళ్లి రావడానికి ఒక్కొక్కరికి రూ.13 వేలు పైగా అయింది. వీరేకాదు తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది అయ్యప్ప భక్తులకు ఇలాంటి వ్యయప్రయాసలు తప్పడం లేదు. రైళ్లలో రిజర్వేషన్ దొరక్క కొందరు విమానాల్లో, మరికొందరు ప్రైవేట్ బస్సుల్లో, ఇంకొందరు వాహనాలు మాట్లాడుకుని వెళ్లాల్సి వస్తోంది.
కేరళలోని శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే పెద్ద సంఖ్యలో ఉంటారు. రైల్లో స్లీపర్ రూ.575, థర్డ్ ఏసీ రూ.1,545, సెకండ్ ఏసీ రూ.2,235కు వెళ్లి రావచ్చు. దీంతో అంతా తొలి ప్రాధాన్యం రైళ్లకే ఇస్తారు. శబరి, కేరళ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు వెళతాయి. శబరి ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 18 వరకు భారీగా వెయిటింగ్ లిస్టు ఉంది. సగటున రోజుకు స్లీపర్‌లో 500, థర్డ్ ఏసీలో 150, సెకండ్ ఏసీలో 60 వరకు ఉంటోంది.
24వ తేదీ ప్రయాణానికి ఒక్క స్లీపర్‌లోనే ఏడొందల మందికి పైగా వెయిటింగ్ లిస్టు టికెట్లు తీసుకోవడం రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది. కేరళ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ బోగీల్లో జనవరి 12 (8వ తేదీ తప్ప) వరకు రిగ్రెటే. అంటే వెయిటింగ్ లిస్టు పరిమితీ దాటింది. థర్డ్ ఏసీలోనూ నిరీక్షణ జాబితా భారీగా ఉంది. ధన్‌బాద్-అలెప్పి ఎక్స్‌ప్రెస్, వివేక్ ఎక్స్‌ప్రెస్, రప్తిసాగర్ వంటి వాటిలోనూ ఇదే పరిస్థితి.
బస్సు టికెట్ రూ.4వేల పైమాటే:ప్రైవేట్ ఆపరేటర్లు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు బస్సులు నడిపిస్తున్నారు. రైళ్లలో టికెట్లు దొరకని నేపథ్యంలో వాటిలో భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఏసీ స్లీపర్ బస్సులో ఒక్కో టికెట్‌కు రూ.3,500-4,150 వరకు తీసుకుంటున్నారు.. కొచ్చికి విమాన టికెట్ల ధరలు ప్రయాణ తేదీకి ఒకట్రెండు రోజుల ముందైతే ఒక్కో టికెట్ రూ.12-14 వేల వరకు ఉంటోంది. దీంతో భక్తులకు భారీగా అదనపు వ్యయం తప్పట్లేదు.