తెలంగాణ

telangana

ETV Bharat / state

TERRACE GARDENING: మిద్దె తోటలు పెంచాలనుకుంటున్నారా.. మేము తోడుగా ఉంటాం..! - TELANGANA 2021 NEWS

పెరుగుతున్న జనాభా, అభిరుచులు, ఆహారపు అలవాట్లు మారిపోతున్న వేళ... రసాయన అవశేషాల్లేని నాణ్యమైన కూరగాయలను సొంతంగా పండించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు నగరవాసులు. చాలా మంది హైదరాబాద్‌లో ఉద్యాన శాఖ శిక్షణ సంస్థలో శిక్షణ పొందేందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే కార్యాలయంపై ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్ నమూనా... అందరినీ ఆకట్టుకుంటోంది.

training-of-horticultural-officers-for-those-who-want-to-grow-a-terrace-garden
మిద్దె తోటలు పెంచాలనుకుంటున్నారా.. మేము తోడుగా ఉంటాం..!

By

Published : Jul 18, 2021, 12:26 PM IST

తెలుగు రాష్ట్రాల్లో మిద్దె తోటల సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. అదొక అభిరుచి, వ్యాపకంగా మారిపోతుండటంతో ప్రత్యేకత సంతరించుకుంటోంది. పట్ణణ, నగర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు టెర్రస్ గార్డెనింగ్​పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ద్వారా రసాయన అవశేషాల్లేని పంటలు పండించుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఉద్యాన శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. డాబాలు, బహుళ అంతస్తుల భవనాలపైన, ఇంటి ఖాళీ జాగాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు పండించుకునేందుకు అవసరమైన విత్తనాలు, ఉపకరణాలు, ఇతర సాంకేతిక సలహాలను అందిస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ నాంపల్లి ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రతీ నెల ఒక రోజు ఈ తరహాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. కరోనా లాక్‌డౌన్ ఆంక్షల సమయంలో మన కూరగాయలు మనమే సొంతంగా పండించుకోవాలని ఇంటి పంట సాగుకు శ్రీకారం చుట్టామని ఔత్సాహికులు చెబుతున్నారు.

ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం..

జంట నగరాల నుంచి మిద్దె తోటల నిర్వాహకులు, ఔత్సాహిక నగర సేద్యం ప్రేమికులు ఈ శిక్షణ తరగతులకు హాజరై... విత్తనాల సేకరణ, ఎలా విత్తుకోవాలి, చీడపీడలు, తెగుళ్ళు వస్తే తీసుకోవాల్సిన చర్యలు, నీటి నిర్వహణ, కోత వంటి అంశాలపై విజ్ఞానం పొందుతున్నారు. ఇంట్లో ఉన్న వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, ఆకుకూరల వంటి వాటితో వర్మీకంపోస్ట్, జీవామృతం, ఘనామృతం తయారీల గురించి ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. డాబాలు, బహుళ అంతస్తుల భవనాలు, బాల్కనీల్లో కొద్దిపాటి స్థలాల్లో పంటలను ఎలా పెంచాలనే విషయంపై అధికారులు సలహాలిస్తున్నారు. స్వయంగా తామే రసాయన అవశేషాల్లేని పంటలను పండించుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం సొంతం చేసుకుంటున్నామని మిద్దెతోటల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

సంవత్సరం నుంచి మిద్దెపై పంటలు పండిస్తున్నాం. బయట కూరగాయలు కొనడం పూర్తిగా మానేసాం. ఉద్యానశాఖ అధికారులు శిక్షణ ఇస్తున్న విషయం తెలిసి వచ్చాము. పాడైన కూరగాయలు, చెత్తాచెదారంతో ఎరువుల ఎలా తయారు చేయొచ్చు, తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు ఎలా పండించొచ్చు అనేవి అర్థమయ్యేలా చెప్పారు. ఇక్కడికొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

శ్రీజ, కూకట్ పల్లి

ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల దిగుమతులపై ఆధారపడకూడదన్నది తెలంగాణ ఉద్యాన శాఖ లక్ష్యం. కోటి 10 లక్షల మంది జనాభా ఉన్న హైదరాబాద్​లో అపారమైన టెర్రస్‌లు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలాల్లో మిద్దె తోటలు సాగు చేస్తే.. ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పొందవచ్చన్నని అధికారులు చెబుతున్నారు. టెర్రస్ గార్డెనింగ్​పై ఆసక్తిగల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తామెప్పడూ సిద్ధంగా ఉంటామని అంటున్నారు.

మన పిల్లలకు మనమేమిచ్చినా ఇవ్వకపోయినా... ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వాలండి. అందరూ మిద్దె తోటలు పెంచి రసాయనాలు లేని కూరగాయలను పండించుకోవాలి. అదే మనందరి ఆరోగ్యాలను కాపాడుతుంది.

ఎలిజిబెత్‌, రాంపల్లి

ఈ తరహా సాంకేతిక శిక్షణ తరగతులు విజ్ఞానదాయకంగా ఉంటున్న దృష్ట్యా ఔత్సాహిక కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, రాయితీ అవసరం లేదంటూ... వేలల్లో ముందుకొస్తుందన్నందున "వన్‌ స్టాప్ సొల్యూషన్" పేరిట మిద్దెతోటకు కావాల్సిన వస్తువులన్నీ అందుబాటులో పెట్టేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది.

ఇదీ చూడండి:అంపశయ్యపై కనకరాజు: ఇందిరాగాంధీతో నృత్యం చేసిన 'పద్మశ్రీ'కి పలకరింపే కరవైంది!

ABOUT THE AUTHOR

...view details