హైదరాబాద్ షేక్‌పేటలోని ఓల్డ్ విలేజ్‌కి చెందిన కొట్టం సత్యనారాయణ కుటుంబం... అదే ప్రాంతంలో ఉండే దగ్గరి బంధువులతో కలిసి ఈ నెల 10న ఉదయం ఏపీలోని విజయవాడ, సింహాచలం, అరకు, తదితర ప్రాంతాల పర్యటనకు బయలుదేరారు. దినేశ్ ట్రావెల్స్‌కు చెందిన మినీబస్సులో వెళ్లిన వీరంతా.... మధ్యాహ్ననానికి విజయవాడ చేరుకుని... దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరిలోని నరసింహస్వామిని దర్శించుకుని... అదేరోజు రాత్రి అన్నవరం చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేసుకుని సింహాచలం వెళ్లారు. అప్పన్న దర్శనం తర్వాత ఆరోజు రాత్రి అక్కడే బస చేసి... నిన్న తెల్లవారుజామున అరకు బయలుదేరారు. అక్కడ పలు ప్రదేశాలు తిరిగి... మధ్యాహ్నం బొర్రా గుహలకు వెళ్లి అక్కడే భోజనం చేశారు. సాయంత్రం అక్కడి నుంచి సింహాచలం బయలుదేరారు. ఈ క్రమంలోనే బొర్రా, టైడాకు మధ్యన డముకు సమీపంలోని అతిప్రమాదకరమైన మలుపు వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపుతప్పి 80 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.
22 మందికి గాయాలు
అప్పటికే చిమ్మచీకటి అలుముకోవటంతో ఏం జరిగింది తెలియని పరిస్థితి నెలకొంది. క్షతగాత్రుల ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే.... కుటుంబ యజమాని సత్యనారాయణ,ఆయన మనుమరాలు శ్రీనిత్య, బంధువు సరిత, లత ప్రాణాలు కోల్పోయారు. బస్సులోని 22 మందికి తీవ్రగాయాలయ్యాయి.
యాజమాన్యం మోసం!
విహారయాత్ర ముగించుకుని తిరిగివస్తున్నామని చెప్పిన కాసేపటికే ప్రమాదం బారిన పడటంతో... బాధితుల ఇళ్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం 4 గంటల సమయంలోనే తమతో మాట్లాడారని... రాత్రి పూట ప్రయాణం వద్దని చెప్పామని బంధువులు చెబుతున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం మోసం చేసి... ఫిట్‌నెస్ లేని బస్సును ఇచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు.