Traffic restrictions in Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముగింపు సభ జరగనుంది. దీంతో ఆ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆంక్షల దృష్ట్యా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
ఆంక్షలిలా.. చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంకు వద్ద దారి మళ్లించి పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా అనుమతించనున్నారు.గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ నుంచి ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ వద్ద దారి మళ్లించి, చాపెల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
>రవీంద్రభారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారిమళ్లించనున్నారు.
>బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద కుడివైపునకు అనుమతించకుండా గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపెల్‌రోడ్డు మీదుగా పంపిస్తారు.
>నారాయణగూడ సిమెట్రి నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దారిమళ్లించి హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా అనుమతిస్తారు.
>కింగ్‌కోఠి, బొగ్గులకుంట నుంచి బషీరాబాగ్, భారతీయ విద్యాభవన్ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్ కోఠి క్రాస్‌రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్‌మహల్ హోటల్, ఈడెన్ గార్డెన్ మీదుగా అనుమతిస్తారు.
>బషీర్‌బాగ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వద్ద దారిమళ్లించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు.
>హిమాయత్‌నగర్ వైజంక్షన్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద దారి మళ్లించనున్నారు.
ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేడు ముగియనున్నాయి. ఈ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణకు చెందిన సమరయోధుల వారసులను, ఇటీవల పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను, ఇతర ప్రముఖులను ఈ సందర్భంగా సీఎం సన్మానించనున్నారు.
సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ గాత్రకచేరి, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందంతో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సి బ్రదర్స్ ఖవ్వాళీ, స్థానిక కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వజ్రోత్సవాలు పురస్కరించుకుని నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘువీడియో ప్రదర్శన ఉంటుంది. లేజర్ షోతో పాటు భారీఎత్తున బాణసంచా ప్రదర్శనలతో వజ్రోత్సవాలు ముగుస్తాయి.
రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, ట్రస్టు బోర్డుల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు అన్ని జిల్లాల నుంచి 30వేల మంది ప్రజలు హాజరుకానున్నారు.