Trading Cyber Fraud in Hyderabad: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. ఈ కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్పి.. బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ మాయాగాళ్ల చేతిలో మోసపోతున్న కేసులు రోజుకి కనీసం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇలాగే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి ఫారెక్స్ ట్రేడింగ్‌తోలాభాల ఆశ చూపించి రూ.73లక్షలు కాజేశారు.
Trading Cyber Fraud :ఫారెక్స్ ట్రేడింగ్‌తో రూ.వేలల్లో లాభాల ఆశ చూపించిన సైబర్ ముఠా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి 73 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. తొలిసారి పెట్టుబడికి 22 వేల రూపాయలు లాభం వచ్చినట్లు ఆశపెట్టి.. ఆ తర్వాత వివిధ ఛార్జీల పేరు చెప్పి ఈ మొత్తం కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంసీఏ పూర్తి చేసిన ఓ వ్యక్తి ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతని వాట్సాప్ నెంబరుకు ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో సందేశం వచ్చింది. ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని భావించిన అతడు.. అందులో సూచించిన యాప్‌లు డౌన్‌లోడ్ చేశారు.
ఆ తర్వాత టెలిగ్రామ్ ద్వారా పరిచయమైన కొందరు యూఎస్ డాలర్లలో రూపంలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించారు. తొలిసారి రూ. 35.24 లక్షలు, ఆ తర్వాత గ్యారంటీ ఫీజు రూ.3.5 లక్షలు, బదిలీ రుసుము రూ.9.04 లక్షలు, బ్యాంకు సెక్యూరిటీ ఫీజు రూ. 2.4 లక్షలు, బ్యాంకు లావాదేవీల రుసుము రూ. 2.40 లక్షలు వసూలు చేశారు. డబ్బు పంపిన ప్రతిసారీ యాప్‌లో లాభాలు వచ్చినట్లు రెట్టింపు సొమ్ము చూపించేవారు.