ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య పిలుపు మేరకు అమెరికాలో జరుగుతున్న వర్ణవివక్ష ఖండించాలని ఏఐటియుసీ, సిఐటీయూ సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ నుండి బాగ్లింగంపల్లి చౌరస్తా వరకు యూనియన్ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బిజెపి ప్రభుత్వం కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు పెంచుతూ, కొనసాగిస్తున్నాయని అందుకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా పిలుపునిచ్చారు. కుల, జాతి రహిత సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం ముందుకు సాగాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు.
'కార్మికుల హక్కులు కాలరాస్తే సహించేది లేదు' - సీఐటీయూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తే సహించబోమని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. పెట్టుబడిదారి పోకడలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా జాతి వివక్ష పెరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పేదలు, బడుగు బలహీన వర్గాలపై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి.
అమెరికాలో జాత్యహంకారంతో అక్కడ పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్పై దాడిచేసి అతని మరణానికి కారకులైన సంఘటనను వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారని, దేశంలో కూడా ప్రజలు తిరుగుబాటు చేసి కులమతాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఒక్క పేద కార్మికునికి, వలస కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. ప్రజలను విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అనుసరించి తమ పబ్బం గడుపుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కరోనా వంటి కష్ట సమయంలో కార్మిక హక్కులను హరించి బడా పెట్టుబడిదారులకు లాభాలను చేకూర్చే కేంద్ర ప్రభుత్వం కుట్రలు కార్మికవర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులు కాలరాయాలని ప్రయత్నిస్తే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.