REVANTH REDDY TWEET: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సమస్యల పరిష్కరించమని విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ట్విటర్ పిట్ట ఇచ్చిన హామీకి ఇప్పటికీ అతీగతీ లేదని ఆయన కేటీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. తెరాసకు విద్యార్ధులు, యువతే బుద్ది చెబుతారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిదంటే: బాసరలోని ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళనపై తేజగౌడ్ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌కు బుధవారం మంత్రి కేటీఆర్ స్పందించారు. విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులపై 8 వేల మంది విద్యార్థులు రోడ్డెక్కారంటూ... ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామని ట్విటర్ వేదికగా తెలిపారు. కేటీఆర్ చేసిన రీట్వీట్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సమాధానం ఇచ్చారు. సంబంధిత వైస్ ఛాన్స్‌లర్‌తో నిన్న సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. అయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని రేవంత్ ఆరోపించారు.