తెలంగాణ

telangana

ETV Bharat / state

TPCC PAC Meeting : అస్త్రశస్త్రాలతో పీఏసీ సమావేశానికి సిద్ధమవుతున్న హస్తం నేతలు

tpcc pac meeting : రాష్ట్ర పీఏసీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్కం ఠాగూర్‌ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు... పార్టీ కార్యక్రమాల నిర్ణయంపై పట్టుబట్టే అవకాశం ఉంది.

Telangana congress
Telangana congress

By

Published : Jan 3, 2022, 5:18 AM IST

tpcc pac meeting : రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 5న గాంధీభవన్‌లో జరగనుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్కం ఠాగూర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా సభ్యత్వ నమోదు, నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ కమిటీ పనితీరు చర్చించనున్నారు. నాలుగైదు రోజులుగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి... పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఎర్రవెల్లి రైతు రచ్చబండ కార్యక్రమం ప్రకటనతో ఉత్పన్నమైన విభేదాలు రోజురోజుకూ తారస్థాయికి చేరుకుంటున్నాయి.

ఆ లేఖ బయటకెలావచ్చింది...

congress letter viral : ఇటీవల సంగారెడ్డిలో జరిగిన అధికార సమావేశంలో జగ్గారెడ్డి, మంత్రి కేటీఆర్​ కలిసి పాల్గొన్న తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరును విమర్శిస్తూ అధిష్ఠానానికి 4 పేజీల ఫిర్యాదు చేశారు. ఆ కాపీ మీడియాకు విడుదల కావడంతో పతాక శీర్షికలతో వార్తలు ప్రచురితమయ్యాయి. అధిష్ఠానం నుంచి ఒత్తిడి రావడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి... తనకు తెలియకుండానే లేఖ లీకయిందని వివరణ ఇచ్చారు. మరుసటి రోజు చిన్నారెడ్డి అధ్యక్షతన సమావేశమైన పార్టీ క్రమశిక్షణ కమిటీ... జగ్గారెడ్డిని పిలిపించి వివరణ కోరతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి అభ్యర్థిని ఎవరిని అడిగి ప్రకటించారని, భూపాలపల్లి పర్యటన విషయం ఇంఛార్జి అయిన తనకు చెప్పకుండా చేశారని నిలదీశారు. ఈ అంశాలపై రేవంత్‌ను సైతం క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవాలని, అప్పుడే తానూ హాజరవుతానని మీడియాకు వివరణ ఇచ్చారు. దీంతో విభేదాలు మరింత తీవ్రతరం అయ్యాయి.

సామాజికి మాధ్యమాల దుష్పచారం చేస్తున్నాయి

jaggareddy warning : ఆదివారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి... తాను కేటీఆర్​తో అధికార కార్యక్రమంలో కలిశానని కొన్ని సామాజిక మాధ్యమాలు దుష్ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ తన విషయంలో జోక్యం చేసుకుని మీడియాకు తెలియజేయడంపై నిరసన వ్యక్తం చేశారు.

"సంగారెడ్డిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో మంత్రి హోదాలో పాల్గొన్న కేటీఆర్​ను.. ఎమ్మెల్యేగా కలిశాను. అభివృద్ధి కోసం నిధులు అడిగాను. నాయకులు ఎదురెదురుగా కలిసినప్పుడు పలకరించుకోవడం సంప్రదాయం. మంత్రి కేటీఆర్​ను కలిస్తేనే.. పార్టీ కండువా కప్పుతారా..? మరి అదే కేటీఆర్​ను రేవంత్​రెడ్డి కూడా కలిశారు. ఆయన మీద ఎందుకు ఇలాంటి వార్తలు రాయరు. ఒకట్రెండు యూట్యూబ్ ఛానెళ్లు నేను ఏకంగా కేటీఆర్​కు ఏజెంట్ అని రాశారు. అవే ఛానెళ్లు మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు రాయరు. తెరాసలోకి వెళ్లాలనుకుంటే నాకు అడ్డం ఏముంది. నేరుగానే వెళతా. కోవర్టుగా ఉండాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఏదంటే అది రాస్తా అంటే.. చూస్తూ ఊరుకునేది లేదు. తాట తీస్తా".-జగ్గారెడ్డి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు

వాడీ వేడిగా సాగే అవకాశం

మరోవైపు క్రమశిక్షణ కమిటీకి లేని అధికారాన్ని చేజిక్కించుకుని లేఖను చర్చకు పెట్టడంపై స్పష్టత ఇవ్వాలని పీఏసీ సమావేశంలో జగ్గారెడ్డి డిమాండ్ చేసే అవకాశం ఉంది. పార్టీ కార్యక్రమాలు చేపట్టే ముందు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు పాటించడంలేదని ఆరోపిస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయాల వల్ల నాయకులు భాగస్వామ్యం కాలేకపోతున్నారని పలువురు సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న పీఏసీ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చూడండి:Jaggareddy warning: 'ఏది పడితే అది రాస్తే ఊరుకునేది లేదు.. తాట తీస్త'

ABOUT THE AUTHOR

...view details