డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ద్వారా 30 లక్షల మందికి డిజిటల్ సభ్యత్వం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీపీసీసీ ప్రారంభించింది (digital membership registration). ఓటర్ కార్డు ద్వారా తొలిసారి డిజిటల్ సభ్యత్వం ఇస్తున్నారు. డేటా అనటికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది.
రాష్ట్రంలో 30లక్షలకు పైగా కాంగ్రెస్ సభ్యత్వాలు నమోదు చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్న ఆయన..అన్ని వర్గాల రక్షణ కోసం పోరాడుతున్న రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలవాలని కోరారు. గాంధీభవన్‌లో ప్రారంభమైన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల బీమా సదుపాయం కల్పించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా, మండల అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపిన రేవంత్.....14 నుంచి 21వరకు గ్రామాల్లో కాంగ్రెస్ జనజాగరణ యాత్రలు చేపడతామని వెల్లడించారు. డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్‌లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.