తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది: ఉత్తమ్ - telangana varthalu

తెలంగాణ వచ్చాక ఉద్యోగులను సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు 43శాతం తగ్గకుండా ఫిట్​మెంట్​ ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. లేకపోతే ఆందోళనలకు కాంగ్రెస్​ అండగా ఉంటుందన్నారు.

tpcc-chief-uttam-kumar-reddy-spoke-on-telangana-government
ఉద్యోగులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది: ఉత్తమ్

By

Published : Jan 28, 2021, 4:14 PM IST

'ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది'

తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పూర్తిగా నిరంకుశంగా పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ఆదేశాల మేరకే 7.5శాతం ఫిట్​మెంట్​ నిర్ణయం జరిగిందన్న ఉత్తమ్‌... 43శాతం తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఉద్యోగులు చేసే అన్ని ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

హౌస్‌ అలవెన్స్‌ తగ్గించడమంటే ఉద్యోగస్తులను చులకన భావంతో చూడడమేనని అన్నారు. ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారని.. అందుకే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యమించాలన్నారు. ఉద్యోగ సంఘాలు బలహీనపడడం వల్లనే ఇలా జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల పదోన్నతుల అంశంపై అతీగతిలేదన్నారు. ఉద్యోగులు కళ్లు తెరిస్తే కేసీఆర్ సర్కారు భూస్థాపితం కాక తప్పదన్నారు.

ఇదీ చదవండి: పీఆర్​సీ సిఫారసులను అంగీకరించేది లేదు: యూటీఎఫ్​

ABOUT THE AUTHOR

...view details