కరోనా నిబంధనలను సాకుగా చూపి ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారని ఉత్తమ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ప్రభుత్వ విస్తరణపై కాంగ్రెస్ నేతల తరఫున ఉత్తమ్ కౌంటర్ దాఖలు చేశారు.
నిబంధనలు ఉల్లంఘించలేదు..
కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎన్నడూ నిబంధనలు ఉల్లంఘించలేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. పోలీసులు నిరాధారమైన ఆరోపణలతో తమ రాజ్యాంగబద్ధమైన విధులను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు భారీ జన సమీకరణకు పిలుపునివ్వడం లేదని ఉత్తమ్ తెలిపారు. తనిఖీలు చేసి నిపుణులతో చర్చించడం ప్రతిపక్ష నేతలుగా తమ బాధ్యతని పేర్కొన్నారు. కరోనా నిబంధనల పేరుతో తమను అక్రమంగా అరెస్టు చేసి... నిర్బంధించి రాజకీయ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్లో ఆరోపించారు. తమ కార్యక్రమాలను ఆపేందుకే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.