కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ను సర్కారు ఎత్తివేసింది. 38 రోజుల పాటు ఆంక్షలతో ఇళ్లకే పరిమితమైన జనానికి ఆదివారం నుంచి ఉపశమనం లభించింది. సోమవారం ఉరుకుల పరుగుల జీవితాలు యథావిధిగా ప్రారంభం కాగా... కాస్త ఊపిరి పీల్చుకునేందుకు పార్కులు, పర్యాటక ప్రాంతాలకు వరుస కట్టారు. చార్మినార్ వద్ద షాపింగ్ జోరందుకుంది. సాలార్‌జంగ్ మ్యూజియంకు ఇప్పుడిప్పుడే సందర్శకుల రాక మొదలవుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియంలోకి అనుమతిస్తున్నారు. ట్యాంక్ బండ్‌పై ఆహ్లాదభరిత వాతావరణాన్ని జనం ఆస్వాదిస్తున్నారు. నెక్లెస్ రోడ్‌పై సెల్ఫీలు తీసుకుంటూ.... ప్రశాంత వాతావరణంలో వాకింగ్ చేస్తుండడం ఉపశమనంగా ఉందని నగరవాసులు చెబుతున్నారు.
Tourism: కిటకిటలాడుతున్న పర్యాటక ప్రాంతాలు
రాష్ట్రంలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం నుంచి అన్‌లాక్ మొదలు కాగా... అంతటా సందడి నెలకొంది. చార్మినార్‌ను సందర్శించేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో నయా సొబగులు అద్దుకున్నాయి.
ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో మాస్కులు ధరించి సాధారణ రోజుల్లో లాగే ప్రజలు బయటికి వచ్చి స్వేచ్ఛగా విహరిస్తున్నారు. చార్మినార్, గోల్కండ, బిర్లా మందిర్, దుర్గం చెరువు తీగల వంతెన, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కులు సందర్శకులతో కళకళలాడాయి. లుంబినీ పార్కు నుంచి హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని వరకు బోటు ప్రయాణాలు సాగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలంటూ అవగాహన కల్పించే బోర్డులు ఏర్పాటు చేశారు. సాయంకాలం వేళ హాయిగా ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం దక్కిందంటూ నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:Cm Yadadri Visit: సీఎం యాదాద్రి పర్యటన... బాలాలయంలో దర్శనం