తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top news: టాప్ న్యూస్ @7PM - Telangana news in telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top news
టాప్ న్యూస్ @7PM

By

Published : May 23, 2022, 6:59 PM IST

  • 'భారత్, జపాన్ దోస్తీ ఎంతో స్పెషల్'

భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్​ పెట్టుబడులు ముఖ్యమైన పాత్ర పోషించాయని ప్రధాని మోదీ అన్నారు. రెండురోజుల జపాన్​ పర్యటనలో ఉన్న మోదీ.. సోమవారం ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. మరోవైపు జపాన్​కు చెందిన 30పైగా దిగ్గజ వ్యాపార సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, సీఈఓలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు మోదీ.

  • రాజ్యసభ సభ్యుడిగా రవి ఏకగ్రీవం

రాజ్యసభ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి నుంచి గాయత్రి రవి ఎన్నికపత్రం స్వీకరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉపఎన్నికకు ర‌విచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • సింహంతో ఆటలు.. చేతి వేలు ఫసక్​!

మృగరాజు సహనాన్ని పరీక్షించిన ఓ వ్యక్తి.. చివరకు చేతి వేలును కోల్పోయాడు. జమైకాలోని సెయింట్​ ఎలిజబెత్​లోని ఓ జూలో జరిగిందీ ఘటన. అక్కడే పని చేస్తున్న ఓ ఉద్యోగి.. బోనులో ఉన్న సింహాన్ని ఆట పట్టించాడు. కోపంతో ఆ సింహం గర్జిస్తున్నా.. పదేపదే బోనులోకి చేతులు పెట్టి, పొడిచేందుకు యత్నించాడు. చివరకు ఆ సింహం ఒక్కసారిగా అతడి చేతిని కరిచింది. వెంటనే ఒక వేలు తెగిపోగా.. అతడు బాధతో విలవిల్లాడుతూ పరుగులు తీశాడు.

  • అనిశా వలలో తహసీల్దార్

పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్‌గా పనిచేస్తున్న సంపత్‌.. ఓ వ్యక్తికి సంబంధించి భూమి సర్వే చేసేందుకు రూ. 3 లక్షలు లంచం అడిగారు. అందుకు ఒప్పుకొన్న వ్యక్తి ముందుగా రూ. లక్ష ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అనిశా అధికారులు నిఘా పెట్టారు. ఆ వ్యక్తి నుంచి రూ. లక్ష తీసుకుంటుండగా అధికారులు సంపత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్‌తో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

  • బాలుడి మృతి కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్‌లో 12 ఏళ్ల బాలుడి మృతి కేసులో మిస్టరీ వీడింది. 12ఏళ్ల బాలుడిని కుక్కలు కరిచి చంపినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. 15 వీధి కుక్కలు ఒకేసారి దాడిచేసి... బాలుడి మెడ, తల, వీపు భాగంలో తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిని ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ బృందం ధ్రువీకరించింది. ఈ నెల 19న కుల్సుంపురాలో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మెడ, తలపై తీవ్రగాయాలతో మూసీ ఒడ్డున మృతదేహం లభ్యమైంది.

  • గోదావరి బోర్డుకు ప్రభుత్వం లేఖ

గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరంపై ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటి ఎత్తిపోతల సబబు కాదని లేఖలో ఈఎన్‌సీ పేర్కొన్నారు. తద్వారా గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • తుపాకులతో ఎన్నికల ప్రచారం

తుపాకులు చేతపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంఘటన ఝార్ఖండ్​, సాహిబ్​గంజ్​ జిల్లాలోని ముఫస్సిల్​ స్టేషన్​ పరిధిలో కొద్ది రోజుల క్రితం జరిగింది. జిల్లా పరిషత్​ ఎన్నికల్లో సునీల్​ యాదవ్​ అనే అభ్యర్థి ఈ ప్రచారం నిర్వహించారు. తుపాకులతో గ్రామాల్లో తిరుగుతున్న వీడియోను భాజపా నేత బాబులాల్​ మరాండీ ట్విట్టర్​లో పోస్ట్​ చేయగా.. ఆ దృశ్యాలు వైరల్​గా మారాయి.

  • రష్యా కమాండర్​కు జీవిత ఖైదు!

ఉక్రెయిన్‌పై దండయాత్రలో పుతిన్‌ బలగాలు అనేక అకృత్యాలకు పాల్పడ్డాయని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. రష్యా సైనికుడికి ఉక్రెయిన్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధరించిన ఉక్రెయిన్‌ న్యాయస్థానం.. రష్యా యుద్ధ ట్యాంకు కమాండర్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

  • ఇప్పటికైనా గుర్తించినందుకు థ్యాంక్యూ

టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాటర్​ ఛెతేశ్వర్‌ పుజారా ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేశాడు. గత కొంత కాలంగా ఫామ్‌లో లేని అతడిని సెలెక్షన్‌ కమిటీ ఈ ఏడాది మార్చిలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పక్కన పెట్టింది. అయితే, తర్వాత భారత్‌లో టీ20 లీగ్‌ జరుగుతున్న సమయంలోనే పుజారా ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో పాల్గొన్నాడు.

  • నాని కష్టాలు!

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన 'అంటే సుందరానికీ' సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్​ను వరుసగా విడుదల చేస్తున్న ఈ మూవీటీమ్​ తాజాగా 'రంగో రంగ' అనే లిరికల్​ వీడియో సాంగ్​ను రిలీజ్​ చేసింది. ఇందులో నాని పడుతున్న కష్టాలను వివరించారు. ఇక ఈ గీతాన్ని ఎన్​ సీజ కరుణ్య ఆలపించగా, సానాపాటి భరద్వాజ్​ లిరిక్స్​ అందించారు.

ABOUT THE AUTHOR

...view details