తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today టాప్​న్యూస్ 9AM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Aug 30, 2022, 8:59 AM IST

ట్విటర్ వార్, కేటీఆర్ Vs మన్‌సుఖ్ మాండవీయ

తెరాస భాజపా మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందేమి లేదని ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు వివిధ వేదికలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోందని చెబుతోంది. ఈ క్రమంలో ట్విటర్‌ వేదికగా వైద్య కళాశాల కేటాయింపు అంశం మంత్రి కేటీఆర్ - కేంద్రమంత్రి మన్సుక్‌ మాండవీయకు మాటల సంవాదం నడిచింది.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిపై వీడని సందిగ్ధత

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్​లో ఇంకా సందిగ్ధత వీడటం లేదు. టికెట్​ ఎవరికి వస్తుందో తెలియక ఆశావహులు ఎదురుచూస్తుంటే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. రెండు ప్రధాన పార్టీలు భాజపా, తెరాసలు కార్యాచరణనను క్షేత్రస్థాయిలో అమల్లోకి పెడితే హస్తం పార్టీ క్యాడర్​కు భరోసా కల్పించే పరిస్థితుల్లో లేకుండాపోతోంది.

పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద

పూరీలోని జగన్నాథుని రత్నభాండాగారంపై ఆ రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. భాండాగారంలోని రహస్య గదికి సొరంగ మార్గం ఉందంటూ వస్తున్న వార్తలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వెలకట్టలేని సంపద రహస్య గదిలో ఉందని చరిత్ర చెబుతోంది.

రూ.12 వేలలోపు చైనా ఫోన్లపై నిషేధం

చైనా మొబైల్‌ కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సోమవారం వెల్లడించారు. భారత్‌ నుంచి ఎగుమతులు కూడా పెంచాలని కూడా దేశంలో తయారీ/అసెంబ్లింగ్‌ యూనిట్లను నిర్వహిస్తున్న చైనా మొబైల్‌ సంస్థలకు సూచించారు.

బాలుడిపై తల్లి, ఆమె ప్రియుడి కిరాతకం

వావివరసలు మరచి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నాడనే కోపంతో మూడేళ్ల బిడ్డను బలి తీసుకున్నారు. ప్రమాదమంటూ నాటకమాడారు. పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేయడంతో 50 రోజుల తర్వాత గుట్టు రట్టయింది. ఇంతటి దారుణానికి తెగబడిన నిందితులను ముషీరాబాద్‌ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ మృతి

Economist Abhijit Sen died: గుండెపోటుతో ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్(72) మరణించినట్లు ఆయన సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అభిజిత్​కు గుండెపోటు వచ్చిందని.. వెంటనే దిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఆసుపత్రికి చేరుకునేలోపే అభిజిత్ సేన్​ ప్రాణాలు కోల్పోయారని ప్రణబ్ వెల్లడించారు.

పదేళ్లుగా ఒకేచోట సబ్‌రిజిస్ట్రార్లు

No transfers of TS Sub Registrars రిజిస్ట్రేషన్‌ శాఖలో దీర్ఘకాలంగా బదిలీలు లేకపోవడంతో అంతులేని అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రాష్ట్రంలో 141 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉండగా, అందులో పావువంతు మంది సబ్‌ రిజిస్ట్రార్‌లు పది, అంతకన్నా ఎక్కువ ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారే. అవినీతికి అవకాశం ఉన్న శాఖ కావడం, కీలకమైన స్థానాల్లోని వారు ఉన్నచోటే పాతుకుపోవడంతో అవినీతి తారస్థాయికి చేరిందని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖే గుర్తించింది.

ఉపవాసం చేసి మరీ బరువు తగ్గిన ఎలాన్​ మస్క్​

రుచికరమైన ఆహారాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. తాజాగా తిండిపై శ్రద్ధ పెట్టారట. అంతేకాదు, వ్యాయామం కూడా చేయడానికి ఇష్టపడని ఆయన.. తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్లే ఇటీవల తొమ్మిది కిలోల బరువు తగ్గారట. ఇదే విషయాన్ని స్వయంగా వెల్లడించిన ప్రపంచ కుబేరుడు.. తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు.

బ్యాట్​ తగిలి మాజీ క్రికెటర్​ విలవిల

టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (క్రిస్) షాట్‌ కొట్టే సమయంలో పొరపాటున మరో మాజీ ప్లేయర్‌ హేమంగ్‌ బదానీ చేతికి బ్యాట్‌ తగిలింది. పాపం నొప్పితో బదానీ విలవిల్లాడిపోయాడు. అదేంటి వీరిద్దరూ ఎప్పుడు క్రికెట్‌ ఆడారు..? ఎక్కడ ఆడారు..? అని కంగారు పడిపోవద్దు.. శ్రీలంక-అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య ఆసియా కప్‌ ప్రారంభం మ్యాచ్‌ సందర్భంగా కామెంట్రీ బాక్స్‌లో ఓ షాట్‌ గురించి క్రిస్‌ వివరిస్తూ ఉంటాడు. అయితే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పక్కనే ఉన్న హేమంగ్‌ బదానీ చేతికి పొరపాటున బ్యాట్‌ తగిలింది.

పఠాన్​ కోసం షారుక్​ అదిరిపోయే స్కెచ్​

బాలీవుడ్ స్టార్​ హీరో షారుక్​ ఖాన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం పఠాన్. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. దాదాపు రూ.250కోట్లతో రూపొందుతున్న ఈ యాక్షన్‌ డ్రామా చిత్రానికి ఇప్పటినుంచే ప్రచారం నిర్వహించాల్సిందిగా చిత్ర యూనిట్ కోరగా షారుక్​ నిరాకరించారట. కారణం ప్రస్తుతం బాలీవుడ్‌లో నడుస్తున్న బాయ్‌కాట్‌ ట్రెండ్‌.

ABOUT THE AUTHOR

...view details