తెలంగాణ

telangana

ETV Bharat / state

AP Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూనే ఉంది. రాగల 24 గంటల్లో పశ్చిన వాయువ్య దిశగా పయనించి తుపానుగా మారనుంది. ఈ ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Weather Update
Weather Update

By

Published : Dec 3, 2021, 9:11 AM IST

Rains in AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూనే ఉంది. విశాఖకు 770, ఓడిశాలోని గోపాల్ పూర్ కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తుపానుగా మారే సూచనలు ఉన్నాయని, ప్రస్తుతం గంటకు 32 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని పేర్కొంది. రేపు ఉదయనికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.

శనివారం ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని, ఇవాళ అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి 70-90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వేటకు వెళ్లరాదు..!

శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.

పాఠశాలలకు సెలవులు...

ప్రభుత్వ సిబ్బందికి జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దు చేశారు. నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విజయనగరం జిల్లాలో శుక్ర, శనివారాల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్‌ సూర్యకుమారి ప్రకటించారు. తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ సెలవులు ప్రకటించారు. నేటి నుంచి 5 వరకు విశాఖపట్నంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ఆ జిల్లా అధికారులు వెల్లడించారు. శుక్రవారం బయలుదేరే పలు రైళ్లను ద.మ.రైల్వే రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

41 రైళ్ల రద్దు..

బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికలతో పలు ప్రాంతాలకు నడిచే 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రేపు, ఎల్లుండి తిరిగే దూర ప్రాంత రైళ్లను అధికారులు రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ముందస్తుగా మొబైల్ సందేశం ద్వారా పంపనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details