నేడు జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి.. ఉన్నత స్థానాలకు ఎదిగిన కుమార్తెల గురించి మీకోసం.
నాన్న బాధ్యత తీసుకున్నా..
మాది తూర్పు గోదావరి జిల్లా తుని. నాకు తొమ్మిదేళ్లప్పుడు నాన్న చనిపోయారు.అమ్మ కుటుంబ బాధ్యతలు తీసుకుంది. కిరాణ దుకాణంలో పనిచేసింది. చాలీచాలని సంపాదనతో నేనైనా చదువు మానేయాలి.. తమ్ముడైనా బడికి ఆగిపోవాలి. సోదరుడు మానేశాడు. అప్పుడే నిశ్చయించుకున్నా. బాగా చదువుకొని, మంచి ఉద్యోగం తెచ్చుకొని కుటుంబానికి అండగా నిలవాలని. అదే లక్ష్యంతో చదివా. ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఆరోగ్యం దెబ్బతింది. కోలుకోవడానికి ఏడాది పట్టింది. అనుకున్న ఉద్యోగం రాలేదు. హైదరాబాద్‌లో ఐఐటీ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన నెక్ట్స్‌వేవ్ సంస్థలో ఓ సీనియర్ సలహాతో ఆన్‌లైన్ కోర్సుల్లో చేరాను. హెచ్‌టీఎంల్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా. 2 నెలల క్రితం సైయంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరాను. ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు అమ్మ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. నాన్న బాధ్యతలను తీసుకున్నా. -నర్మద కొవ్వూరు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హైదరాబాద్ గీతలు చెరిపి.. వారసులనూ నిలిపి
తల్లి, తనయ, మనుమరాలు ముగ్గురూ వైద్యులే ఆడపిల్లలు గడప దాటేందుకూ వెనకడుగేసే కాలమది. అదీ ఓ సంప్రదాయ గుజరాతీ కుటుంబం. ఆడపిల్లలకు ఉన్నత చదువులంటే తప్పుగా భావించే పరిస్థితుల్లో ఆ అడ్డుగీతల్ని చెరిపి తనకు నచ్చిన వైద్య రంగంవైపు అడుగులేశారు ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ నీనా దేశాయ్. తల్లిదండ్రుల్ని ఒప్పించి ఈ రంగంవైపు వచ్చిన ఆమే దేశంలోనే ఉత్తమ వైద్యురాలిగా రాణించడంతో పాటు నగరంలోని కిమ్స్, మహవీర్, అపోలో ఆసుపత్రుల్లో ప్రసూతి విభాగాల్ని ప్రారంభించారు. 58 ఏళ్లుగా వైద్యురాలిగా రాణిస్తూనే తర్వాతి తరాల్లో ఆడకూతుళ్లనూ ఈవైపు తీసుకొచ్చారు. ఆమె కుమార్తె డాక్టర్ సోనియా దేశాయ్ ఎంబీబీఎస్‌తో పాటు మానసిక వైద్యంలో మాస్టర్స్ చేసి 17 ఏళ్లుగా ప్రధాన ఆసుపత్రుల్లో మానసిక వైద్య నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. మనవరాలు డాక్టర్ స్నేహిషా వైద్యరంగంలోకే వచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వైద్య వృత్తిలోకి రావటానికి వారిద్దరే స్ఫూర్తి అని తెలిపారు. సేవాభావమే వారసత్వంగా
తండ్రి ఆలేటి ఆటం, చిన్నారులతో శ్రమైక్య చిన్నతనం నుంచి కన్నవారి సేవాతత్పరతను చూస్తూ పెరిగిన ఆమె అదే బాటలో సాగుతున్నారు. అనాథ చిన్నారులకు అమ్మగా..మానసిక రోగులకు ఆధారంగా మారారు. ఆమే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలోని ఆలేటి ఆశ్రమ నిర్వాహకులు ఆలేటి ఆటం కుమార్తె ఊడుగుల శ్రమైక్య. ఆటం, ఆయన భార్య లలిత, తల్లి ముత్తి లింగమ్మ సేవల్లో పాలుపంచుకొనే వారు. తల్లిని భార్యను కోల్పోయిన ఆయనకు డిగ్రీ చదివిన కుమార్తె శ్రమైక్య, అల్లుడు హరీష్ తోడుగా నిలిచారు. రోడ్లపై దిక్కులేకుండా అవస్థలు పడుతున్న వారిని పోలీసులు ఈ ఆశ్రమానికి చేర్చుతుంటారు. ఉన్మాద స్థితిలో ఉన్న మానసిక రోగులకు సాంత్వన చేకూర్చడం, అనాథ చిన్నారుల్లో తామున్నామనే నమ్మకాన్ని పాదుగొల్పడం, విద్యాబుద్ధులందేలా చూడటం, నిత్యం సుమారు 160 మందికి స్వయంగా వంటా వార్పు చేయడం శ్రమైక్య విధి. దాతల సహకారంతో నడుస్తున్న ఆశ్రమం తరఫున కొన్ని వందల మందికి సేవలందించారు.
వందేళ్ల వారసత్వాన్ని నిలబెడుతూ..!
వారసత్వమే ఆస్తిగా సాయి ప్రణతి హైదరాబాద్‌లోని సురభి కళామండలికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. ఆధునిక కాలంలో నాటక రంగానికి వన్నె తగ్గడంతో గత వైభవం మసకబారుతూ వస్తోంది. నిలబెట్టేందుకు అయిదో తరం వారసులు నిలబడ్డారు. నటనను విశ్వవ్యాప్తం చేస్తున్న వారిలో అమ్మాయిలూ ఉన్నారు. వారిలో స్ఫూర్తినిస్తున్న వారిలో ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ఎస్వీ సాయి ప్రణతి ఒకరు. అమ్మ రేఖ, నాన్న ఉదయ్‌కుమార్ నుంచి వారసత్వంగా వచ్చిన కళతో చిన్నతనం నుంచే ప్రదర్శనల్లో పాల్గొంటోంది. చదువు పూర్తయి ఉద్యోగావకాశాలొచ్చినా కళను వీడలేదు. కొవిడ్ సమయంలో ఇల్లు జరగనప్పుడు, తను 8 నెలల గర్భిణిగా ఉన్నా ఆన్‌లైన్‌లో నాటక ప్రదర్శనలివ్వడం విశేషం.
ప్రధాని మోదీ మెచ్చిన గుజరాతీ వంటకాలు
తల్లి శాంతాబెన్ గిరిధర్‌లాల్ మష్రూతో రంజనాషా నగరంలోని శివరాంపల్లి సర్దార్ వల్లభాయ్‌పటేల్ నేషనల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో 2016 నవంబరు 23న జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ రంజనాషా చేయించిన గుజరాతి వంటలు తిని మెచ్చుకున్నారు. ప్రధాని కోరిన వంటలను అందించడం తనకు మరచిపోలేని క్షణాలని రంజనాషా తెలిపారు. తల్లి అడుగు జాడల్లో కేటరింగ్‌లో రాణిస్తున్న రంజనాషా
తన తల్లి శాంతాబెన్ అడుగు జాడల్లో రెండున్నర దశాబ్దాలుగా కేటరింగ్ రంగంలో రాణిస్తున్నారు. గుజరాత్ సౌరాష్ట్ర జెత్‌పూర్‌నకు చెందిన శాంతాబెన్ తన తల్లిదండ్రులతోపాటు ఉపాధి కోసం మహారాష్ట్ర అకోలాకు వచ్చారు. 1950లో నగరంలోని సుల్తాన్‌బజార్‌కు చెందిన గిరిధర్‌లాల్ మష్రూతో ఆమెకు వివాహమైంది. హైదరాబాద్‌కు వచ్చే గుజరాతీయులకు ఆమె వండి పెట్టేవారు. తర్వాత నగరంలోని గుజరాతీయుల వివాహాలు, శుభకార్యాలు, విందు, వినోద కార్యక్రమాల్లో వంటలు చేసేవారు. రంజనాషా తల్లికి సహకరించేవారు. అలా తల్లీకూతుళ్లు కేటరింగ్ రంగంలోకి ప్రవేశించారు. 25 ఏళ్ల క్రితం రంజనాషా శాంత కేటరర్స్ సంస్థను స్థాపించారు. గుజరాతీయుల గృహాల్లో జరిగే శుభకార్యాల్లో రంజనాషా వంటలు ఉండాల్సిందే. భర్తతో కలిసి నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:Gulab Cyclone in Telangana : తెలంగాణలోనూ 'గులాబ్' గుబులు.. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు!