నేడు తెరాస అభ్యర్థులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ రాష్ట్రంలోని జిల్లా పరిషత్లన్నీ కైవసం చేసుకున్న తెరాస.. నగర, పురపాలక సంస్థలన్నింటా జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది. టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ, సీనియర్ నేతల మధ్య విభేదాలు కొంత చికాకు పెట్టినా... కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం వల్ల చాలా వరకు తగ్గిపోయాయి. కొన్ని వార్డుల్లో మాత్రం తిరుగుబాటు అభ్యర్థులు కొనసాగుతున్నారు. వారి వల్ల పార్టీ అభ్యర్థుల విజయంపై ప్రభావం ఉండదని భావిస్తున్న తెరాస.. రెబల్స్ విషయంలో ఏం చేయాలో నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అభ్యర్థులు, స్థానిక శాసనసభ్యులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్టీ నాయకత్వం సూచనల మేరకు... ఇంటింటికీ తిరిగి ప్రతీ ఓటరును ప్రసన్నం చేసుకుంటున్నారు. సిరిసిల్లలో మాత్రమే పర్యటిస్తా..
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అవకాశంగా మలుచుకుంటూ.. స్థానిక సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. కేటీఆర్ తన సిరిసిల్ల నియోజకవర్గంలో నిన్న పర్యటించారు. తన నియోజకవర్గంలో మినహా రాష్ట్రంలో ఎక్కడా ప్రచారంలో పాల్గొనని ప్రకటించిన కేటీఆర్.. హైదరాబాద్ నుంచే పర్యవేక్షించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తెరాస అభ్యర్థులతో తెలంగాణ భవన్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
నేడు దిశా నిర్దేశం:
ప్రచార సరళి, ఇతర పార్టీల ఎత్తుగడలు, అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించి.. పలు అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. తొమ్మిది సభ్యుల సమన్వయ కమిటీ జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై కేటీఆర్ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. వివిధ వర్గాల నుంచి నివేదికల ఆధారంగా పార్టీ అభ్యర్థులకు కేటీఆర్ నేడు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇవీ చూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్