మద్యం దుకాణాలు చేజిక్కించుకునేదెవరో.. తెలంగాణలో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 2,216 లిక్కర్ షాపుల కోసం 48 వేల 401 ధరఖాస్తులు రావడం వల్ల ప్రభుత్వానికి రూ. 968.02 కోట్లు రాబడి చేకూరింది. అత్యధికంగా రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్‌లో 422 దుకాణాలకు 8,892, వరంగల్‌లో 261 షాపులకు 8,101, ఖమ్మంలో 165 దుకాణాలకు 7 వేల 711, నల్గొండ డివిజన్‌లో 278 దుకాణాలకు 7099 లెక్కన ధరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ డివిజన్‌లో అతితక్కువగా 131 దుకాణాలకు 1547, హైదరాబాద్ పరిధిలో 173 షాపులకు 1499, అదిలాబాద్‌లో 163కు 2 వేల 956, కరీంనగర్లో 266కు 4013, మహబూబ్‌నగర్‌లో 164 దుకాణాలకు 3383, మెదక్ డివిజన్‌లో 193 షాపులకు 3200 లెక్కన ధరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు.
సగటున 22 దరఖాస్తులు:
అయితే ఒక్కో మద్యం దుకాణానికి సగటున 22 ధరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపుకు వచ్చిన సగటు ధరఖాస్తులను పరిశీలిస్తే.. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది పోటీపడ్డారు. ఒక్కో దుకాణానికి 47 ధరఖాస్తులు వచ్చాయి. వరంగల్ డివిజన్‌లో సగటున ఒక్కో దుకాణానికి 31 ధరఖాస్తులు, నల్గొండ డివిజన్‌లో 26, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో 21 ధరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ డివిజన్‌తో సహా మిగిలిన వాటిల్లో ఒక్కో షాపుకు సగటున 20 కంటే తక్కువగా ధరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు తెలిపింది.
ముందుకు రాకుంటే 5 లక్షల జరిమానా:
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లైసెన్సీల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ ఉప, సహాయ కమిషనర్లకు, ఇతర అధికారులకు కమిషనర్ సోమేశ్‌కుమార్ దిశ నిర్దేశం చేశారు. దుకాణాల వారీగా లాటరీ విధానంలో లైసెన్సీల ఎంపిక కోసం ఆ డీసీల నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. అయితే లాటరీలో ఎవరైనా ఎంపికైన తర్వాత ముందుకు రానట్లయితే వారిపై ఐదు లక్షల జరిమానా విధించనున్నట్లు కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. అనంతరం లాటరీ తీసి మరొకరికి దుకాణం లైసెన్స్ ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ ఎంపికైన వారు వచ్చే నెల ఒకటి నుంచి 2021 అక్టోబరు వరకు రెండేళ్లపాటు మద్యం దుకాణాలు నిర్వహించుకోడానికి అర్హులు అవుతారు.
ఇదీ చూడండి: మరో 8 లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తాం: కేటీఆర్