తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. శ్రీవారి ఆలయంలోని పరకామణి లెక్కల్లో 5.21 కోట్లుగా చేర్చారు. బుధవారం భక్తులు సమర్పించిన కానుకలతో పాటు... కొన్ని రోజులుగా నిల్వ ఉన్న చిల్లర నాణేలను లెక్కించారు. శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ప్రతిరోజూ పరకామణిలో లెక్కిస్తారు. లెక్కించకుండా నిల్వ ఉన్న 2.50 కోట్ల చిల్లర నాణేలను లెక్కించడంతో... భారీ స్థాయిలో ఆదాయం నమోదైంది.
ఉత్సవమూర్తుల పరిరక్షణకు తితిదే చర్యలు...
తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఉత్సవమూర్తుల పరిరక్షణకు తితిదే చర్యలు చేపట్టింది. అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజతో పాటు బుధవారం చేసే సహస్ర కలశాభిషేకం, నిత్యం నిర్వహించే ఆర్జిత వసంతోత్సవ సేవలను ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. తద్వారా మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల అరుగుదలను నిరోధించవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలిలో తీర్మానించారు. తిరుమలలోని శ్రీవారి ఉత్సవమూర్తులకు వివిధ సందర్భాల్లో ఏడాదిలో 450 సార్లు అభిషేకం (తిరుమంజనం) నిర్వహిస్తుంటారు. ఇలా చేయడం వల్ల విగ్రహాలు అరిగిపోతున్నట్లు అర్చకులు గుర్తించారు. విగ్రహాల ముఖాలు మారిపోయి సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొందని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి:సంసార సాగరంలో.. మార్పు మీతోనే మొదలవ్వాలి!