ఈ పాటికి దాదాపుగా ప్రవేశపరీక్షలన్నీ పూర్తయిపోయేవి. విద్యార్థులంతా ప్రవేశాల హడావుడిలో ఉండేవారు. పాఠశాలలతో పాటు కొన్ని ఉన్నతవిద్యా కోర్సుల పాఠాలూ ప్రారంభమై ఉండేవి. అనుకోని విరామం కారణంగా వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టినట్టు అయ్యింది. అయితే పరిస్థితుల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. కొంత ఆలస్యమైనా నెమ్మదిగా ప్రవేశ ప్రకటనలు విడుదలవుతున్నాయి. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణలో ‘దోస్త్’ ప్రకటన వెలువడింది. జేఈఈ, నీట్ తేదీలు ఖరారయ్యాయి. ఏపీపీఎస్‌సీ గ్రూప్స్ మెయిన్స్‌కు తేదీలు ప్రకటించింది. ఇవన్నీ పరిస్థితి మునుపటి స్థితికి వస్తోందనడానికి సూచనలే!.
ఇక విద్యార్థుల విషయానికొస్తే.. సన్నద్ధతను పూర్తిగా ఆపేసినా, నెమ్మదిగా సాగిస్తున్నా వాయిదాలూ, అనిశ్చితే ఇందుకు కారణం. నిన్నటిదాకా ఉన్న పరిస్థితి ఇది. సన్నద్ధత ఆపినా, నచ్చిన విధానంలో సాగించినా పెద్ద నష్టమేమీ లేదు. కానీ ఇప్పటినుంచైనా పూర్తి దృష్టి పెట్టడం తప్పనిసరి. అలాగే ఒక క్రమపద్ధతిలో సాగించడం మరీ ప్రధానం అంటున్నారు నిపుణులు.
ఏ పని అయినా అనుకున్న సమయంలోగా పూర్తిచేయాలంటే క్రమబద్ధమైన ప్రణాళిక ఉండాలి. అప్పుడే చేరుకోవాల్సిన గమ్యం పట్ల ఒక స్పష్టత ఉంటుంది. దాన్ని చేరుకోవడానికి ఎంత శ్రమ అవసరమో తెలుస్తుంది. అందుకే పాఠశాల స్థాయి నుంచే టైం టేబుల్ ద్వారా ప్రణాళికను అలవాటు చేస్తారు. కాబట్టి విద్యార్థి ముందు ప్రణాళికకు ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆపై ఆచరణపై దృష్టిపెట్టాలి.
ఆచరణ ఎలా ఉండాలి?
ఈరోజు మాటేంటి?: విద్యార్థి లక్ష్యం సివిల్స్/ గ్రూప్స్ అనుకుందాం. ఇది దీర్ఘకాలిక లక్ష్యమవుతుంది. ఏ పెద్ద పనైనా సరే పూర్తవ్వాలంటే చిన్న చిన్నవాటిని క్రమంగా కలుపుకుంటూ పోవాలి. ఉదాహరణకు- ఒక వ్యక్తి లక్ష్యం కారు కొనడం అనుకుందాం. ఒక్కసారిగా కొనే స్థోమత లేదు. అప్పుడేం చేస్తాడు? కొద్దికొద్దిగా కూడబెట్టి మొత్తం కలిపి కొనడమో, కొంత సమకూర్చుకున్నాక రుణం తీసుకుని కొనడమో చేస్తాడు. కారు కొనడానికి చేసిన ఈ ప్రయత్నం మొత్తాన్ని చిన్న/ స్వల్పకాలిక లక్ష్యాలుగా చెప్పొచ్చు. విద్యార్థి కూడా సిలబస్ మొత్తానికి వేసే ప్రణాళిక తన దీర్ఘకాలిక లక్ష్యానికి సూచన. ఫలానా రోజు ఏం పూర్తిచేయాలనేది స్వల్పకాలిక లక్ష్యంగా ఉండాలి. అసలు లక్ష్యానికి ఎంత విలువ ఇస్తారో.. వీటికీ అంతే ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇవి క్రమపద్ధతిలో పూర్తయితేనే అసలు గమ్యాన్ని చేరడం కుదురుతుంది. ఏరోజు ప్రణాళికను ఆరోజు ఎంత కష్టమైనా పూర్తిచేసేలా ఉండాలి.
పకడ్బందీగా: ఈరోజు ఇది చేయాలి అనుకోవడం వేరు. దాన్ని కచ్చితంగా అమలు చేయడం వేరు. ఆలోచనల ద్వారా అనుకున్నవాటికీ, పక్కాగా రూపొందించుకోవడానికీ తేడా ఉంటుంది. కాబట్టి ఫలానా రోజు అది చేయాలి, ఇది చేయాలి అనుకోవడానికే పరిమితం కాకుండా దాన్ని పేపర్‌పై నమోదు చేసుకుని ఉంచుకోవాలి. పుస్తకం/ డైరీలో రాసిపెట్టుకోవాలి. ఏరోజు పూర్తిచేసినదాన్ని ఆరోజు టిక్ చేసుకుంటుండాలి. ఇది ఆత్మవిశ్వాసం పెంచుతుంది.
మీది మీకే ప్రత్యేకం:ఏ ఇద్దరి ఆలోచనలూ ఒకలా ఉండవు. ఎవరికి వారే ప్రత్యేకం. ఇది చదువు విషయంలోనూ వర్తిస్తుంది. ఒక అంశాన్ని ఒకరు చదివేతీరుకూ, అర్థం చేసుకునే విధానానికీ తేడా ఉంటుంది. ప్రణాళిక విషయంలో ఇంకొకరు రూపొందించినదాన్నో, వారి దాని ఆధారంగానో చేసుకోకపోవడం మంచిది. ఇది సాయపడకపోగా ఒత్తిడి పెంచగలదు. మీ బలాలు, బలహీనతలు మీకు అర్థమైనట్టుగా ఇంకొకరికి కాకపోవచ్చు. కాబట్టి, కొంత సమయం కేటాయించి అయినా మీకు మీరుగా తయారు చేసుకుంటేనే మంచిది. అన్నీ పూర్తిచేయడానికి సమయం సరిపోకపోవచ్చు. కానీ ఎన్ని శ్రద్ధగా పూర్తిచేశారన్నదానికే విలువెక్కువ.
బృందంగా ఇలా: ఒకప్పుడు పరీక్షలనగానే బృందంగా చదవడానికి ఎక్కువమంది ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఇపుడ[ు ఆ పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. స్నేహితులు ముఖ్యంగా సన్నద్ధతలో సాయపడతారనుకున్నవారితో గ్రూపుగా ఏర్పడవచ్చు. సందేహాలు వగైరా ఉంటే దానిలో తీర్చుకోవచ్చు. ఒకరకంగా ఇది కూడా బృంద సన్నద్ధతే అవుతుంది. అయితే అనవసర, కంగారుపడే విషయాలను ఇందులో చర్చించుకోకూడదన్న నిబంధనను కచ్చితంగా పాటించగలగాలి.
దూరం.. దూరం: సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్‌గానూ మారింది. కానీ సమయపు వృథాకు ప్రధాన వనరూ ఇదే. తెలియకుండానే సమయాన్నంతా తినేసేస్తుంది. కాబట్టి దీని విషయంలోనూ జాగ్రత్త పాటించాలి. అస్తమానం చదవాలంటే ఎంత ఇష్టమైన సబ్జెక్టు అయినా అది ఎవరికైనా కొంత విసుగ్గా ఉండొచ్చు. అప్పుడప్పుడు విరామ సమయంలో భాగంగా చూడటంలో తప్పులేదు. కానీ, దానికీ సమయాన్ని కేటాయించుకోవాలి. దాన్ని పక్కాగా పాటించాలి. చదువు మధ్యలో సోషల్‌మీడియాను అసలు దూరం పెడితే ఇంకా మంచిది.
విరామ సమయం పూర్తయింది. కెరియర్‌పై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చింది. కాబట్టి, అందుబాటులో ఉన్న సమయాన్ని విజయవంతంగా ఉపయోగించాలంటే ప్రణాళిక వేసుకోవడం, దాన్ని తు.చ. తప్పకుండా పాటించడమొక్కటే మార్గం. లేదంటే ఏడాది కాలం వృథా అవడమో, భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి రావడమో జరుగుతుంది.