కరోనా నివారణకు కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు మరింత బాధ్యత తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం పేదలకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని అన్నారు. వీటితో పాటు నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. లాక్డౌన్తో పౌల్ట్రీ రైతులు, పంటలు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రవాణా వ్యవస్థ సరిచేస్తే ప్రజలందరికీ నిత్యవసరాలు అందించవచ్చని అన్నారు. అలాగే నిత్యావసరాలను ఇంటింటికీ సరఫరా చేయాలని హితవు పలికారు. వీటితో పాటు పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్ సెంటర్లు పెంచాలని కేంద్రాన్ని కోరారు.
అదే కరోనాకు ముందు...
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. సామాజిక దూరం పాటించటం వల్లే కరోనా నియంత్రణలో ఉందని అన్నారు. మనుషులకు దూరంగా ఉండటమే కరోనాకు మందు అని చెప్పారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వీయ నియంత్రణ పాటించాలని హితవు పలికారు. శుభ్రత పాటిస్తే కరోనాను చాలావరకు నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలు, సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. ఇలాంటి సమయంలో ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని చంద్రబాబు సూచించారు. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు కలిగించకూడదని అన్నారు. పోలీసులు, అధికారులతో ఘర్షణ పడటం సరికాదని స్పష్టం చేశారు.