తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2021, 4:50 AM IST

ETV Bharat / state

వచ్చే నెలలో మూడో దఫా పల్లె, పట్టణ ప్రగతి

మూడో దఫా పల్లె, పట్టణ ప్రగతికి రాష్ట్రం సిద్ధమవుతోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పదిరోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులోనే హరితహారాన్ని కూడా చేపట్టనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. కార్యక్రమ సన్నాహకాల్లో భాగంగా వచ్చే సోమవారం కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు.

palle and pattana pragathi, telangana
పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణ

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు... పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా.... ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టింది. 2019 సెప్టెంబర్ ఆరో తేదీన మొదటిసారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెలరోజుల పాటు తొలి విడత కార్యక్రమం జరిగింది. 2020 జనవరి రెండో తేదీ నుంచి పది రోజులపాటు రెండో దఫా కార్యక్రమాన్ని చేపట్టారు. పల్లెలు, పట్టణాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచేలా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పచ్చదనం పెంపు దిశగా తగిన చర్యలు తీసుకున్నారు. కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్, పురపాలక చట్టాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నర్సరీలు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాన్ని చేపట్టారు.

జనాభా ప్రాతిపదికన నిధులు

ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేకంగా ఓ ట్రాక్టర్​ను సమకూర్చారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించి ప్రతి నెలా జనాభా ప్రాతిపదికన నిధులు ఇస్తున్నారు. వీటన్నింటి కారణంగా పల్లెల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ అవార్డులు కూడా దక్కాయని తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం లేదని చెబుతోంది. ఈ తరుణంలో మూడో విడత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని కూడా ఇందులో భాగంగానే చేపడతామని తెలిపారు.

చేరుకోవాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయి

పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు సఫలం అయ్యాయన్న సీఎం కేసీఆర్... చేరుకోవాల్సిన లక్ష్యాలు మాత్రం ఇంకా ఉన్నాయని ఇటీవలి సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. అధికారులు ఆశించిన మేర పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ పర్యటనల సందర్భంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం తొలుత ప్రకటించినప్పటికీ అది జరగలేదు. మూడో విడత కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో ఈనెల 28వ తేదీన సీఎం కేసీఆర్ కీలక సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

ఏడో విడత హరితహారం

అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్డీఓలతో సమావేశం కానున్న సీఎం... మూడో దఫా కార్యక్రమంపై వారికి దిశానిర్దేశం చేస్తారు. లక్ష్యాలు నిర్దేశించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేయనున్నారు. ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదార్ల వెంట బహుళ వరసల అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, మండల కేంద్రాల్లో ఐదు నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై కూడా అధికారులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేయనున్నారు.

ఇదీ చదవండి:Complaint: ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details