విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడం, హాజరు శాతాన్ని పెంచడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అయినా, ఉదయం అల్పాహారం లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పేద పిల్లలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించేంత వరకూ ఆకలి బాధను దిగమింగుతూ పాఠాలు వినాల్సిన పరిస్థితి. ఆకలిని తట్టుకోలేక పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులూ ఉన్నారు. ఇదే విషయం చెన్నైలోని కొడుంగైయూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పి.కె.ఇళమారన్‌ని ఆలోచింపజేసింది. ఆయన ఉదయం తరగతి గదులకు వెళ్లగానే కొందరు విద్యార్థులు నీరసంగా కనిపించేవారు. మరికొందరు విద్యార్థులు పాఠాలపై దృష్టిపెట్టే వారు కాదు. అల్పాహారం తినకపోవడమే దీనికి కారణమని గ్రహించిన ఇళమారన్.. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రోజూ తనే సొంతంగా టిఫిన్లు అందించాలనుకున్నాడు. పాఠశాల సమీపంలోని టిఫిన్ సెంటర్ యజమాని కొంత తగ్గింపు ధరకు అల్పాహారం అందించేందుకు ముందుకు వచ్చాడు. అలా గత రెండేళ్లుగా రోజూ 100 నుంచీ 120 మంది దాకా విద్యార్థులకు పాఠశాల ఆవరణలో ఇడ్లీ, పొంగలి అందిస్తూ వారి ఆకలి బాధను తీరుస్తున్నాడు ఇళమారన్. అల్పాహారం కోసం ఆయన ప్రతి నెలా తన జీతంలోంచి రూ.8 వేల వరకూ ఖర్చు చేస్తున్నాడనీ, ఈ కారణంగా విద్యార్థులు చదువుల్లో చురుగ్గా ఉంటున్నారనీ అంటారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటి పేరైంది..
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రంగినేని నర్సింహారావు చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించి చదువుతూనే బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం పొందాడు. తనలా పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సమస్య ఆటంకం కాకూడదనీ, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో స్థిరపడాలనీ అనుకున్న నర్సింహారావు.. ఆ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలను కల్పించడంతో పాటు పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. విద్యార్థుల కోసం 20కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేశాడు. వాళ్లు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి సొంత ఖర్చులతో మాక్ పరీక్షలను నిర్వహిస్తూ ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాడు. చదువుకోవాలన్న ఆసక్తి ఉండి, ఫీజులు చెల్లించే స్తోమతలేని విద్యార్థులకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ ఆర్థికసాయం చేస్తున్నాడు. సుమారు 20 మంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నాడు. దాదాపు 100 ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచరూ, ఇతర సామగ్రీ అందించాడు. అలా గత 20 ఏళ్ల నుంచీ ఇప్పటి వరకూ తన జీతంలోంచి రూ.2 కోట్ల దాకా వెచ్చించాడు. అతడి సేవలకు గానూ నర్సింహారావు ఇంటిపేరు బీఎస్‌ఎన్‌ఎల్‌గా స్థిరపడిపోయింది.