రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. తాజాగా 313 మందిలో కరోనా వైరస్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో వైరస్ లక్షణాలు లేని బాధితులు దాదాపు 90 శాతం మంది ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఈ తరహా కొవిడ్ బాధితులు సుమారు 70 శాతం మంది ఉండగా.. తాజాగా ఈ సంఖ్య ఏకంగా 90 శాతానికి పెరగడం ఆరోగ్య శాఖ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎటువంటి లక్షణాల్లేకుండా కొవిడ్ ఉన్నట్లుగా నిర్ధారణ కావడం వల్ల.. బాధితుల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలేవీ రావని, ఇది ఒక విధంగా చూస్తే ఆహ్వానించదగిన పరిణామమేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అయితే దీని వల్ల నష్టం జరిగే ప్రమాదమూ పొంచి ఉందని కూడా హెచ్చరిస్తున్నాయి. ఎటువంటి లక్షణాల్లేకపోవడం వల్ల బాధితులెవరూ కొవిడ్ జాగ్రత్తలేవీ పాటించడం లేదని, వారి ద్వారా వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతరులకు త్వరగా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 40 శాతం మంది 12-18 ఏళ్లలోపు విద్యార్థులేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ నమోదైన గణాంకాల్లో 11-20 ఏళ్లలోపు వారిలో బాధితులు 9.03 శాతం ఉండగా.. తాజాగా ఏకంగా నాలుగింతలకు పైగా ఈ వయసు వారిలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం.. పని ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
స్వల్ప లక్షణాలతోనే..
ఏడాది కిందట కొవిడ్ కేసులు నమోదైన తొలినాళ్లలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, నీరసం తదితర తీవ్ర లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారు. తాజా కేసుల్లో ఈ లక్షణాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. సాధారణ జలుబు, కొద్దిగా పొడి దగ్గు, జ్వరం లేకపోవడం, ఒకవేళ వచ్చినా 99-100 డిగ్రీల లోపే నమోదవడం, రుచి, వాసన గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువమందిలో ఉన్నాయి. లక్షణాల తీవ్రత లేకపోవడం వల్ల కూడా అధికులు కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా వైరస్ వ్యాప్తి క్రమేణా పెరగడానికి వారు కారణమవుతున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖరు నాటికి కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి.