Telangana Farmers problems : వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రోత్సాహం కరవైంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) కింద తెలంగాణలోని 25 బ్యాంకులు రూ.3075 కోట్ల రుణం ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. అయినా బ్యాంకులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేద్యం అనంతరం పంటలను నిల్వ చేసుకోవడంతో పాటు ఉత్పత్తులను శుద్ధిపరచి మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ని రూపొందించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ద్వారా రైతులకు ఈ నిధి కింద రాయితీలు, తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని కూడా కేంద్రం సంకల్పించింది.
Telangana agriculture sector : అయితే, రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకూ బ్యాంకులు ఏఐఎఫ్ కింద కేవలం 836 మందికే రూ.773.01 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. అందులో 560 మందికి మాత్రమే రూ.361.16 కోట్లు అందజేశాయి. రాష్ట్రంలోని 25 బ్యాంకుల్లో 9 బ్యాంకులు ఇంతవరకూ ఒక్కపైసా రుణాన్ని కూడా విదల్చలేదు. ఆ తొమ్మిది బ్యాంకుల్లో రెండు బ్యాంకులు ఏడుగురికి రూ.7.90 కోట్లు మంజూరు చేసినట్లు కాగితాల్లో చూపుతున్నా.. సొమ్మును మాత్రం ఇప్పటి వరకు విడుదల చేయలేదని కేంద్రానికి ఇచ్చిన తాజా నివేదికలో బ్యాంకర్ల సమితి వెల్లడించింది. రుణాల మంజూరు, అందజేతలో జాప్యం కారణంగా మౌలిక సదుపాయాల కల్పన పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
తక్కువ వడ్డీకే రుణాలు..ఏఐఎఫ్ నుంచి కేవలం 4 శాతం వడ్డీకే బ్యాంకులు ప్యాక్స్లకు రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించింది. ఈ వడ్డీని సకాలంలో చెల్లిస్తే 3 శాతం రాయితీగా భరిస్తామని నాబార్డు సైతం తెలిపింది. రాష్ట్రంలో 906 ప్యాక్స్లు ఉండగా.. ఇప్పటివరకూ 300 సంఘాలకు మించి రుణాలను పొందలేదు. సేద్యానికి ఉపయోగపడే వ్యవసాయ యంత్రాల కొనుగోలు, పంటలు నిల్వ చేసుకోవడానికి వీలుగా చేపట్టే గోదాములు, శీతల గిడ్డంగులు, ప్యాక్హౌస్ల నిర్మాణాల కోసం బ్యాంకులు రైతు సంఘాలకు కూడా ఏఐఎఫ్ ద్వారా రూ.2 కోట్ల వరకు రుణం ఇవ్వాలి.