తెలంగాణ

telangana

ETV Bharat / state

అరకొర జీతాలు.. ఆకలి కేకలు - coronavirus india

అసలే అరకొర వేతనాలు.. వార్షిక ప్రోత్సాహకాల ఊసుండదు. జీతం పెంచాలని అడిగితే కొలువులుండవు.. వేసవి సెలవుల కారణంగా మే నెలలో వేతనమూ లభించదు. ఇది రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న అత్యధిక శాతం ఉపాధ్యాయుల పరిస్థితి.

There are no salaries for private teachers since last two months in Telangana
అరకొర జీతాలు.. ఆకలి కేకలు

By

Published : May 13, 2020, 9:55 AM IST

రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి నెల వేతనం రూ.3వేల నుంచి రూ.25వేలకు మించదు. అది కూడా ప్రాంతం, విద్యార్హత, బోధించే సబ్జెక్టు, రోజుకు తీసుకునే క్లాస్‌లపై ఆధారపడి ఉంటుంది. పీజీలు, బీఈడీ విద్యార్హతలున్నా నెల వేతనం రూ.15వేలు దాటేది అతి తక్కువ మందికే. జీవో 1 ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేసే మొత్తం రుసుముల్లో 50శాతం ఉద్యోగుల వేతనాలకు కేటాయించాలి. వాస్తవ పరిస్థితి తద్విరుద్ధం. ఇక భవిష్య నిధి చెల్లింపు.. మొత్తం ఉద్యోగుల్లో 25 శాతానికి మించదు. సాధారణ రోజుల్లో ఇదీ పరిస్థితి. ఇప్పుడు మాయదారి కరోనా ఉపాధ్యాయుల జీవితాలను కోలుకోలేని దెబ్బతీసింది. కనీసం కుటుంబ పోషణకూ దిక్కులేకుండా చేసింది. మార్చి వేతనంలో సగం చెల్లించింది కూడా 50 శాతం పాఠశాలలే.

మానవత్వంతో ఆలోచించాలి

మొత్తంగా విద్యార్థుల నుంచి 15-20 శాతం ఫీజులు వసూలు కాలేదన్నది నిజమేనని, కాకపోతే 40-50 శాతం బకాయిలు ఉన్నాయని చెబుతూ యాజమాన్యాలు ఉపాధ్యాయులకు వేతనం చెల్లించడం లేదని తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ షబ్బీర్‌ అలీ విమర్శించారు. ఇప్పటి పరిస్థితుల్లో యాజమాన్యాలు మానవత్వంతో ఆలోచించాలని ఆయన కోరారు. తెలంగాణలో గుర్తింపు పొందిన పాఠశాలల నిర్వహణ సంఘం(ట్రెస్మా) రాష్ట్ర కార్యదర్శి శేఖర్‌రావు మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి రుసుముల వసూలుకు పాఠశాలలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

  • హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో ఓ ప్రజాప్రతినిధికి చెందిన ప్రైవేట్‌ పాఠశాలలో ఆయన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. బోధనలో తొమ్మిదేళ్ల అనుభవజ్ఞుడు. ఆయన నెల వేతనం రూ.12వేలు. కరోనాతో మార్చి 16 నుంచి విద్యాసంస్థలు మూతపడటంతో మార్చి వేతనం సగమే అందింది. ఏప్రిల్‌ది అసలే ఇవ్వలేదు. భార్య, ఇద్దరు పిల్లలతో రూ.3,500 అద్దెకు ఓ ఇంట్లో ఉంటున్నారు. చేబదుళ్లతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
  • జగిత్యాల జిల్లాలో నాలుగైదు శాఖలున్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడి నెల వేతనం రూ.18వేలు. 15 ఏళ్లుగా బోధన వృత్తిలో ఉన్నారు. మార్చిలో సగం రోజులు పాఠశాల పనిచేసినా వేతనం ఇవ్వలేదు. ఏప్రిల్‌ది అడిగే పరిస్థితీ లేదు. జగిత్యాలలో రూ.3,500కు అద్దె ఇంట్లో భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. వేతనం రాక, 20 రోజులపాటు కూరగాయలు అమ్మినా లాభం లేక, వేములవాడలోని అత్తగారింట కాలం గడుపుతున్నారు.
  • హైదరాబాద్‌ బడంగ్‌పేటలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన వేతనం రూ.15వేలు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఆయన 15 ఏళ్లుగా బోధన వృత్తిలోనే ఉన్నారు. మార్చిలో 11 రోజుల వేతనం రూ.5,500 ఇచ్చారు. బడులు తెరిచాక మిగతా 15రోజుల జీతం ఇస్తామన్నారు. ఏప్రిల్‌కు ఇచ్చేది లేదని ముందే చెప్పేశారు. ఆయన భార్య కూడా ఓ బడిలో పనిచేస్తున్నా మార్చి వేతనం ఇవ్వనేలేదు. కరోనా కాలంలో పచ్చడి మెతుకులతో కాలం గడుపుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి :ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!

ABOUT THE AUTHOR

...view details