తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. తెరాస అధికారంలోకి వచ్చిన 2018 మే 18న వారి కోసం తొలి వేతన సవరణ కమిషన్‌ను (పీఆర్‌సీని) ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి బిస్వాల్ ఛైర్మన్‌గా, విశ్రాంత ఐఏఎస్‌లు ఉమామహేశ్వర్‌రావు, మహ్మద్ అలీ రఫత్‌లు సభ్యులుగా నియమితులయ్యారు.
ఆది నుంచి ఏకసభ్య కమిషన్ ఉండడం ఆనవాయితీ కాగా సత్వరమే నివేదిక ఇచ్చేందుకు సీఎం త్రిసభ్య కమిషన్‌వైపు మొగ్గు చూపారు. కమిషన్.. బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త వేతన సవరణ మార్గదర్శకాలపై మూడు నెలలలోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటికి నివేదిక పూర్తి గాకపోవడంతో సెప్టెంబరులో గడువు పెంచింది. ఆ తర్వాత 2019 ఏప్రిల్‌లో, నవంబరులో, 2020 ఫిబ్రవరిలో గడువు పొడిగించింది. అదీ ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ గడువులోపు నివేదిక వచ్చి కొత్త పీఆర్‌సీని ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పీఆర్‌సీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
త్వరలో నివేదిక
వేతన సవరణ సంఘం.. పీఆర్‌సీపై తుది నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సమాచార సేకరణ పూర్తయింది. మరోవైపు ఆర్థిక శాఖ సైతం జీతభత్యాల పెంపుదల ప్రభావం ఎంత, ఏ మేరకు ఫిట్‌మెంట్ ఇస్తే ఎంత భరించాల్సి ఉంటుందనే అంశంపై గణాంకాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మంజూరు చేసిన డీఏలను కలిపి, కొత్త పీఆర్‌సీ అంచనాలను రూపొందిస్తోంది.