తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం - The story of a five-year-old kidnapping ... happy ending

స్కూల్ నుంచి రావాల్సిన తమ ఐదేళ్ళ చిన్నారి ఇంటికి రాలేదు....పాఠశాలకు వెళ్ళి చూస్తే అక్కడాలేదు. చుట్టుపక్కల వాళ్ళను అడిగితే ఓ ముసలాయన మీ పాపను తీసుకెళ్లాడంటే... ఒక్కసారిగా భయాందోళనకు లోనైంది ఆ తల్లి. దిక్కు తోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించింది. కలకలం రేపిన చిన్నారి కిడ్నాప్​ వ్యవహారాన్ని పోలీసులు 12 గంటల్లో ఛేదించడం వల్ల కథ సుఖాంతమయింది.

కిడ్నాప్​... కథ సుఖాంతం

By

Published : Jul 11, 2019, 6:08 PM IST

Updated : Jul 11, 2019, 10:33 PM IST

కిడ్నాప్​... కథ సుఖాంతం

హైదరాబాద్​ లంగర్​​హౌస్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ప్రశాంత్ నగర్​లో చిరంజీవి, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు... నరేష్, వైష్టవి. తమ ఇంటికి సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఐదేళ్ళ వైష్టవి ఒకటవ తరగతి చదువుతోంది. రోజూ మధ్యాహ్నం మూడు గంటలకే ఇంటికి వచ్చే వైష్టవి రాకపోవడంతో కంగారుగపడ్డ జ్యోతి చుట్టు పక్కల గాలించింది.

రంగంలోకి దిగిన పోలీసులు

పాఠశాల నుంచి బయటకు వచ్చిన వైష్టవిని గుర్తుతెలియని వ్యక్తి తీసుకెళ్ళాడని స్థానికులు చెప్పడం వల్ల లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

కీలకంగా మారిన సీసీటీవీలు:

సమీపంలోని సీసీటీవీను పరిశీలించిన పోలీసులు... ఓ వ్యక్తి పాపను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. నిందితుడు పాపను తీసుకు వెళ్ళిన దారిలోని సీసీటీవి ఫుటేజ్​ని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులకు ఆ వృద్ధుడు హైదరాబాద్ నుంచి కొడంగల్ వైపుగా వెళ్ళినట్లు నిర్థారించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఊపిరిపీల్చుకున్న తల్లిదండ్రులు:

నిందితుడు వికారాబాద్​ జిల్లా అంగడి రాయచూర్ గ్రామంలో ఫకీరప్పగా గుర్తించిన పోలీసులు... అతని నుంచి పాపను స్వాధీనం చేసుకున్నారు. పాప ఒంటిపై గాయాలు ఉండటంతో చికిత్స చేయించిన కొడంగల్ పోలీసులు... అనంతరం లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించారు. చిన్నారి సురక్షితంగా ఉండటంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. వైష్ణవిని హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

తండ్రే కిడ్నాప్​ చేయించారనుకున్నారు..!

అసలు పాపను ఎందుకు అపహరించాడు అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా గత పది రోజులుగా వైష్ణవి తండ్రి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బంధువుల సాయంతో అతనే ఈ కిడ్నాప్ చేయించి ఉంటాడని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తొలుత ఆ కోణంలో దర్యాప్తు చేశారు. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తికి... వైష్టవి తండ్రి చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు.

అసలు ఎందుకీ కిడ్నాప్​:

వైష్ణవిని ఎత్తుకెళ్ళిన వ్యక్తి కొడంగల్‌ మండలం రాయచూర్ గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అతను గత రెండు నెలలుగా స్థానికంగా కూలి పని చేస్తుండేవాడని లంగర్ హౌస్ ఇన్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కిడ్నాప్ తరువాత పాప ఆరోగ్యం క్షీణించినందున నీలోఫర్​కు తరలించారు.

ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు... తమ ప్రాంతంలో కొత్త వాళ్ళు ఎక్కువగా సంచరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను స్కూలుకు పంపాలంటేనే భయంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: చెరువులో టిక్​టాక్​ చేస్తూ యువకుని మృతి​

Last Updated : Jul 11, 2019, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details