హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. కంటపడితే చాలు కరుస్తున్నాయి. బహదూర్‌పుర, రామంతాపూర్ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు బలి తీసుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ఏళ్లు గడుస్తున్నా నియంత్రణ సాధ్యపడకపోవడం.. ఆ పేరుతో ఏటా రూ.10 కోట్ల నిధులు ఖర్చు చేస్తుండటంపై విమర్శలొస్తున్నాయి.
లెక్కల మాయాజాలం
బల్దియా పశువైద్య విభాగం లెక్కల ప్రకారం.. రోజుకు 250-300 శునకాలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు(ఏబీసీ) చేస్తారు. ఏడాదికి కనీసం లక్ష, అయిదేళ్లలో 5 లక్షల శునకాలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు జరిగాయి. అంటే చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు కనిపించకూడదు. వాటి సంఖ్య మాత్రం నగరంలో పెరుగుతోంది. వీధుల్లో గతంలో రెండు, మూడు సంచరిస్తుంటే..ప్రస్తుతం 20 నుంచి 30 తిరుగుతున్నాయి. రాత్రి వేళ అడుగుపెట్టలేని పరిస్థితి. జీహెచ్‌ఎంసీ ఆపరేషన్ల పేరుతో ప్రైవేటు వైద్యులకు ఒక్కో శునకానికి రూ.1,500 చెల్లించేది. విమర్శలు రావడంతో ఇటీవల స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రక్రియ నిర్వహిస్తోంది. గతంలో అనుభవం లేని వైద్యుల వల్ల శస్త్రచికిత్సలు విఫలమవడం లేదా? శునకం చనిపోవడం జరిగేది. ఏబీసీ ప్రక్రియ నిధుల మేతగా మారిందన్న విమర్శలొచ్చాయి.. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విభాగం తనిఖీల్లోనూ రేబిస్ టీకాలకు సంబంధించి లోపాలు వెలుగు చూశాయి. ఆపరేషన్లు నిర్వహించే కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా..ఆ పని జరగలేదు.
లాక్‌డౌన్‌లోనూ..
గతేడాది మార్చి 23 నుంచి మే 15 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంది. ఆ సమయంలోనూ వీధి కుక్కలు జనాలపై దాడులు చేశాయి. ఫీవర్ ఆసుపత్రిలో నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే.. 2020 జనవరిలో 2405, ఫిబ్రవరిలో 2161, మార్చిలో 1755, ఏప్రిల్‌లో 282, మేలో 0, జూన్‌లో 1143, జులైలో 738, ఆగస్టులో 969, సెప్టెంబరులో 1044, అక్టోబరులో 1278, నవంబరులో 1553 మంది కుక్కకాటుకు గురయ్యారు. ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించిన వారిని లెక్కిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.