పురపోరుపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టులో ఈరోజు మున్సిపల్ ఎన్నికల కేసు విచారణకు రానుంది. వార్డుల పునర్విభజనలో తప్పులు దొర్లాయని ఇదివరకే పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొన్ని చోట్ల ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులు లేని 69 పురపాలికల్లో ఎన్నికలకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.
ఒకేసారి విచారించండి..
అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారణ జరపాలని ఎస్ఈసీ ధర్మాసనాన్ని కోరగా.. ఇవాళ విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఈరోజు న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఆధారంగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పోలింగ్ కేంద్రాల ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ ప్రకటించింది. కోర్టు కేసుల కారణంగా కొన్ని చోట్ల కేంద్రాల తుది జాబితా ప్రకటించలేదు.