కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ గ్రీన్‌హిల్స్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి జూన్ 24 నుంచి జ్వరం వస్తుండటంతో దమ్మాయిగూడ, ఈసీఐఎల్ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినప్పటికీ తగ్గలేదు. ఫలితంగా 27న ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా.. నాలుగు గంటల పాటు ఉంచుకుని బెడ్లు ఖాళీ లేవని పంపించేశారు. అదేరోజు సికింద్రాబాద్‌లోని మరో నాలుగు ప్రముఖ ఆసుపత్రులకు వెళ్లగా మా దగ్గర బెడ్లు ఖాళీగా లేవనే సమాధానమే వచ్చింది. చివరకు ఐదో రోజు జులై 1న నానక్‌రాంగూడలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కొవిడ్ పరీక్షలు చేసేందుకు నమూనాలు సేకరించారు. కానీ పాజిటివ్ వచ్చిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పకపోగా.. ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లోనూ లేదు.
నిలదీస్తే.. కరోనా అన్నారు..!
ఐదు రోజులుగా షుగర్, బీపీ, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యచికిత్స అందిస్తున్నామని వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులకు తొలుత సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న కుటంబ సభ్యులకు మృతదేహాన్ని చూసేందుకు అనుమతి ఇవ్వకపోగా.. స్థానిక పోలీసులు జీహెచ్‌ఎంసీ సిబ్బందిని తీసుకురావాలని సూచించారు. అనుమానం వచ్చిన కుటంబ సభ్యులు అసలు ఏమైందని సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తే కరోనాతో మృతి చెందాడని సమాధానం ఇచ్చారు. కొవిడ్ నిబంధనల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులకే మృతదేహం అప్పగిస్తామని చెప్పారు. బిల్లు లెక్కలు తేలకపోవడంతో సోమవారం రాత్రి వరకూ మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించలేదు.