తెలంగాణ

telangana

ETV Bharat / state

తీర్పు రిజర్వ్​: కూల్చడమా.. మిగల్చడమా?

ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై గత కొద్ది రోజులుగా హైకోర్టులో జరుగుతున్న వాదనలు ముగిశాయి. విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్​ చేసింది. ఎర్రమంజిల్​ భవనాలు కూల్చివేసి అసెంబ్లీ నిర్మించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

By

Published : Aug 7, 2019, 8:55 PM IST

Updated : Aug 8, 2019, 6:25 AM IST

తీర్పు రిజర్వ్

ఎర్రమంజిల్​ భవనాల భవితవ్యం త్వరలో తేలనుంది. ఈ భవనాల కూల్చివేతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 2010లో రూపొందించిన మాస్టర్ ప్లాన్​ను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. దీనిలో ఎర్రమంజిల్ చారిత్రక కట్టడంగా ఉందనే విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. 2031 మాస్టర్ ప్లాన్​ను హైకోర్టుకు సమర్పించిన సర్కార్​ మరో 3 మాస్టర్ ప్లాన్లను హెచ్ఎండీఏ రూపొందిస్తోందని ధర్మాసనానికి తెలిపింది.

తీర్పు రిజర్వ్​: కూల్చడమా.. మిగల్చడమా?

తీవ్ర ట్రాఫిక్ సమస్య

అసెంబ్లీ నూతన భవనాన్ని ఎర్రమంజిల్​లో నిర్మించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎర్రమంజిల్​లో అసెంబ్లీ భవనాలను నిర్మించడం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. చారిత్రక కట్టడమైన ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

సదుద్దేశంతోనే

అధునాతన సౌకర్యాలతో అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఎర్రమంజిల్​ను ఎంచుకుందని.... ఈ మేరకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని అదనపు ఏజీ వాదించారు. వందేళ్ల క్రితం నిజాం నవాబు.. టౌన్ హాల్ కోసం ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని నిర్మించారని... ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా నూతన అసెంబ్లీ నిర్మాణం తప్పనిసరన్నారు.

చట్టవిరుద్ధం

వారసత్వ సంపద, చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని... వీటిని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. రెగ్యులేషన్ 13 ప్రకారం హైదరాబాద్ పరిధిలో ఉన్న చారిత్రక కట్టడాల జోలికి ప్రభుత్వం వెళ్లకూడదని... కానీ జీవో 183 తీసుకొచ్చిన ప్రభుత్వం చారిత్రక కట్టడాల జాబితాను రద్దు చేయడం చట్టవిరుద్ధమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసులో దాదాపు నెల రోజులపాటు పలు దఫాలుగా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సర్కార్​ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థిస్తుందో లేక వ్యతిరేకిస్తుందో త్వరలో తేలనుంది.

ఇవీ చూడండి: తెలంగాణ చిన్నమ్మ ఇకలేరు

Last Updated : Aug 8, 2019, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details