తెలంగాణ

telangana

ETV Bharat / state

రామంతాపూర్​ ప్రైవేట్ కళాశాల ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశం - ramanthapur private college incident updates

రామంతాపూర్​లోని ప్రైవేటు కళాశాల ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఆపొద్దని కళాశాలలను ఆదేశించింది.

కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

By

Published : Aug 19, 2022, 7:30 PM IST

రామంతాపూర్​లోని ప్రైవేటు కళాశాల ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. నివేదిక అందాక బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఆపొద్దని కళాశాలలను ఆదేశించింది. ఏ కారణంతోనూ విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని.. కోర్సు పూర్తయిన వారికి తప్పకుండా ధ్రువపత్రాలు ఇవ్వాలని పేర్కొంది. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో లేదా ఇంటర్​ బోర్డుకు ఫిర్యాదు చేయాలని బోర్డు కార్యదర్శి జలీల్​ తెలిపారు. ఈ క్రమంలోనే ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే..

హైదరాబాద్​ రామంతాపూర్​లోని ప్రైవేటు కళాశాలలో విద్యార్థి నాయకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాయి నారాయణ అనే విద్యార్థి సదరు కళాశాలలో జూన్​లో ఇంటర్ పూర్తి చేశాడు. కళాశాలకు రూ.16 వేల ఫీజు కట్టాల్సి ఉండగా.. మొత్తం చెల్లిస్తేనే టీసీ ఇస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో సాయి నారాయణ కళాశాలకు వెళ్లాడు. ఫీజు చెల్లించలేదని, టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. అతనితో పాటు విద్యార్థి నాయకుడు సందీప్, మరికొందరిని తీసుకెళ్లాడు. ఫీజు బకాయిలు ఉండటంతో టీసీ ఇవ్వడానికి కళాశాల సిబ్బంది నిరాకరించారు.

ఇదే విషయంపై సందీప్, ప్రిన్సిపల్​కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఫీజు విషయం, టీసీ గురించి మాట్లాడుతుండగా సందీప్ ప్రిన్సిపల్​ను బెదిరించేందుకు తనతో తీసుకొచ్చిన పెట్రోల్​ను ఒంటిపై పోసుకున్నాడు. కృష్ణాష్టమి వేళ వెలిగించిన దీపం పక్కనే ఉండటంతో మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ సుధాకర్​రెడ్డి, ఏవో అశోక్​రెడ్డి గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. సందీప్​ సహా ప్రిన్సిపల్ సుధాకర్​రెడ్డి, ఏవో అశోక్​రెడ్డి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని, ముగ్గురూ కోలుకుంటున్నారని పోలీసులు వివరించారు.

ఇవీ చూడండి..

ఫ్రెండ్​కు టీసీ ఇవ్వలేదని కళాశాలలోనే పెట్రోల్ పోసుకొని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ఆ గ్రామంలోని కుక్కలు కోటీశ్వరులు, ఏటా భారీగా ఆదాయం, అదిరే లైఫ్​స్టైల్

ABOUT THE AUTHOR

...view details