పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలో మరో 25 బస్తీ దవాఖానాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హబ్సీగూడ డివిజన్ రాంరెడ్డి నగర్‌లో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సంతోషన్‌నగర్ డివిజన్‌లోనూ మరో బస్తీ దవాఖానాను మంత్రి ప్రజలకు అంకితమివ్వనున్నారు. బల్దియా పరిధిలో బస్తీ దవాఖానాలను మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ ప్రాంతాల్లో ప్రారంభించారు.
బోలక్‌పూర్‌లో మంత్రి ఈటల...
సికింద్రాబాద్ బోలక్‌పూర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బస్తీ దవాఖానా ప్రారంభించారు. కవాడిగూడ భీమా మైదాన్‌లో బస్తీ దవాఖానాను మేయర్ రామ్మోహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. సనత్‌నగర్ డివిజన్ అశోక్ కాలనీలో బస్తీ దవాఖానను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రారంభించారు. బస్తీల్లోని పేద ప్రజలకు సత్వర వైద్యం అందేలా సర్కార్ చర్యలు చేపట్టినట్లు పద్మారావు గౌడ్ వివరించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా బస్తీ దవాఖాానాలో సేవలందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా.. రోజుకి సుమారు 14 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ఒక్కో బస్తీ దవాఖానాలో.. ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక సహాయకుడు ఉంటారని తెలిపారు. రాబోవు రోజుల్లో ప్రతి వార్డుకు రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కుత్బుల్లాపూర్ సూరారం డివిజన్ కృష్ణానగర్‌లో బస్తి దవాఖానాను ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ప్రారంభించారు.
రాంరెడ్డి నగర్‌లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఇవీ చూడండి : భాగ్యనగరంలో 90 శాతానికి పైగా ఆసుపత్రులు అనధికారికమే..