Electricity consumption has increased in Telangana: వేసవిలో కరెంట్ డిమాండ్‌ను ఎదుర్కొనే అంశంపై విద్యుత్‌శాఖ దృష్టిసారించింది. ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయ రంగానికి 30 శాతం, పరిశ్రమలకు 20 శాతం వరకు వినియోగం వినియోగం అవుతోందని అంచనా వేశారు. రానున్న రోజుల్లో 16 వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ 300 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదయ్యే అవకాశాలున్నాయని ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు.
వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం: ఎన్టీపీసీ నుంచి ఏడాది క్రితమే విద్యుత్తు సరఫరా మొదలు కావాల్సి ఉన్నా ఇంతవరకూ అందుబాటులోకి రాలేదన్నారు. ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఎక్సేంజీలో విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. డిస్కంలకు భారమైనప్పటికీ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని ప్రభాకర్‌రావు స్పష్టంచేశారు.
విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది: రాష్ట్రంలో గత నెల 28న గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదైంది. ఆరోజు మధ్యాహ్నం ఒంటిగంటా ఒక నిమిషానికి గరిష్ఠ డిమాండ్ 14,794 మెగావాట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే తారీఖున 12,966 మెగావాట్లు నమోదు కాగా ఒక సంవత్సర కాలంలోనే దాదాపు 1,828 మెగావాట్ల అదనపు డిమాండ్ నమోదైనట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి 27న ఒక్కరోజే 290.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెలలో రూ.1500కోట్లు వరకు ఖర్చు అవుతాయి: ఇప్పటికే ఫిబ్రవరి నెలలో విద్యుత్ ఎక్సేంజీలో కరెంట్ కొనుగోలు కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు అయ్యాయని అన్నారు. ఈ నెలలో ఎక్సేంజీలో విద్యుత్ కొనుగోలు చేసేందుకు రూ.1,500 కోట్లు వరకు నిధులు అవసరం అవుతాయని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది.