tsrtc latest news: హైదరాబాద్ ఆర్టీసీ పాలకవర్గ తొలి సమావేశం ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన శనివారం బస్‌భవన్‌లో నిర్వహించారు. చిన్న అంశాలపై నిర్ణయాలకు కూడా పాలకవర్గ సమావేశం వరకు వేచిచూసే అవసరం లేకుండా.. ఇకపై ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లకు కొన్ని అధికారాలు అప్పగిస్తూ పాలకవర్గం తీర్మానించింది. 2014-15 నుంచి 2020-21 సంవత్సరాల వార్షిక లాభనష్టాల నివేదికలకు ఎట్టకేలకు ఆమోద ముద్ర పడింది. ఇటీవల ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాలను ఎండీ సజ్జనార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పాలకవర్గ సభ్యులకు వివరించారు.
స్లీపర్ బస్సులూ...
త్వరలో కొనేవాటిలో దూరప్రాంతాలకు నడిపేందుకు వీలుగా స్లీపర్ సహా అత్యాధునిక బస్సులను తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఏసీ, నాన్ ఏసీతోపాటు విద్యుత్తు ఆధారిత బ్యాటరీ బస్సులనూ సమకూర్చుకోనుంది. విద్యుత్తు బస్సులు కొన్నింటిని హైదరాబాద్‌లోనూ, మరికొన్నింటిని జిల్లాలకు పంపాలని నిర్ణయించింది. మొత్తంగా 1,016 బస్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. నెలవారీగా ఏకీకృత చెల్లింపు(కన్సాలిడేటెడ్) విధానంలో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు సమావేశం తీర్మానించింది. విధివిధానాలను రూపొందించే బాధ్యతలను అధికారులకు అప్పగించింది. పలు అంశాలను పాలకవర్గం ఆమోదించింది. మొత్తం తొమ్మిది మందికిగాను ఏడుగురు పాలకవర్గ సభ్యులు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీకుముదిని, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రవాణాశాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు, కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ డైరెక్టర్ పరేష్‌కుమార్‌గోయల్, ఇంజినీర్-ఇన్-చీఫ్ పి.రవీందర్ హాజరయ్యారు.
"ప్రయాణికులకే కాక ప్రజలకూ మరిన్ని సేవలందించేందుకు వివిధ రంగాలపై దృష్టి సారించాం. కార్గోతో పాటు సమ్మక్క-సారక్క మొక్కులు, భద్రాద్రి సీతారాముల తలంబ్రాల చేరవేత సేవలను ప్రజలకు చేరువ చేశాం. తాజాగా బస్టాండ్లలో ఔషధ(ఫార్మసీ) సేవలు తీసుకొస్తున్నాం. తార్నాక ఆసుపత్రి సేవలను ప్రజలకూ అందుబాటులోకి తెస్తాం. గత ఏడేళ్ల ఆదాయవ్యయాలకు ఆమోదం పొందాం."